Family Suicide : హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలకు సైనేడ్ ఇచ్చి దంపతులు సూసైడ్!
family commit suicide in Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడలో విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Family commit suicide in Kushaiguda: భార్య, భర్త... వారికి ఇద్దరు పిల్లలు..! ప్రస్తుతం హైదరాబాద్ లోని కుషాయిగూడ పరిధిలో నివాసం ఉంటున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు భర్త. అయితే వారి ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలాచోట్ల చూపించినప్పటికీ నయం కావటం లేదు. ఫలితంగా తల్లిదండ్రులు తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. తమ పరిస్థితేంటి ఇలా అనుకున్నారో... చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ ఇద్దరి పిల్లలకు సైనేడ్ ఇచ్చి... తర్వాత వారిద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా ప్రతిఒక్కరిని కలిచివేసింది. ఇక వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సతీశ్ (39) కొంతకాలంగా హైదరాబాద్ కందిగూడలో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయనకు వేద (35)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దబాబు నిషికేత్ (9) స్థానిక భవన్స్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. చిన్నకుమారుడు నిహాల్ (5) ఉన్నాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందిందని పేర్కొన్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇద్దరు పిల్లలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇద్దరికీ చికిత్స చేయిస్తున్నారు. ఇద్దరు పిల్లల అనారోగ్య పరిస్థితి గురించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో పిల్లలకు సైనేడ్ ఇచ్చి.. వారు కూడా తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.
ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుందని కుషాయిగూడ సీఐ పి. వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.