Telangana BJP : తెలంగాణ కమల దళపతి ఎవరు.. ఆశలు పెట్టుకున్న సీనియర్లు.. రేసులో ఆ నలుగురు!
Telangana BJP : తెలంగాణ బీజేపీకి కొత్త సారథిని నియమించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చాలామంది నేతలు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. వారిలో ఆరుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ.. ఓ నలుగురు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నేతల ఒకరు చెప్పారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది. ఈ నెల 6, 7 తేదీల్లో మండల కమిటీలు, ఆ తర్వాత జిల్లా కమిటీల ఎన్నికలు నిర్వహించాలని పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవి పూర్తయితే.. ఈ నెలాఖరు వరకు తెలంగాణ కమలానికి కొత్త దళపతిని నియమించనున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రేసులో చాలామంది..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక కోసం కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేను.. ఎన్నికల అధికారిగా పార్టీ నియమించింది. ఇటు అధ్యక్ష రేసులో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. దీంతో బీజేపీ సారథి ఎవరనేదానిపై ఆసక్తి నెలకొంది. ముగ్గురు ఎంపీలతో పాటు కొందరు సీనియర్ నేతలు కూడా పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.
ముగ్గురు ఎంపీలే..
అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ముఖ్యంగా.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మెదక్ ఎంపీ రఘునందన్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరే కాకుండా.. చింతల రామచంద్రారెడ్డి, గంగిడి మనోహర్‌రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.
పని ఒత్తిడి..
ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. దీంతోపాటు కేంద్రంలో కీలకమైన బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటు రాష్ట్ర పార్టీ బాధ్యతలు.. ఇటు కేంద్ర మంత్రి పదవితో పని ఒత్తిడి ఉంది.
సామాజిక సమీకరణాలు..
ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి స్థానంలో మరో నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ నిర్ణయించింది. అయితే.. బీజేపీలో ముందు నుంచీ ఉన్నవారికే అధ్యక్ష పదవి ఇస్తారా? ఇతర పార్టీల నుంచి వచ్చినవారినీ పరిగణలోకి తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది.
జనవరి నెలాఖరు వరకు..
ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలోనూ తెలంగాణ నుంచి ఒకరు ఓసీ, మరొకరు బీసీ మంత్రులుగా ఉన్నారు. గత పదేళ్లుగా తెలంగాణ బీజేపీకి సారథ్యం వహించిన నేతల్లోనూ ఓసీ, బీసీలే ఉన్నారు. దీంతో సామాజిక సమీకరణాల అంశం తెరపైకి వచ్చింది. అటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి కొత్త అధ్యక్షుడి ఎంపికపై జనవరి నెలాఖరు వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.