Formula E Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్, అప్పటి వరకూ అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశం
Formula E Case : ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ఏసీబీని ఆదేశించింది.
Formula E Case : ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. ఈ కేసులో తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశిస్తూ... మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. క్వాష్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.
ఈ కేసుపై గతంలో విచారణ సందర్భంగా డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఏసీబీని ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. అనంతరం విచారణ డిసెంబర్ 31కి వాయిదా పడింది. ఇవాళ ఈ కేసులో వాదనలు ముగిశాయి. క్వాష్ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది.
ఒప్పందం జరగకముందే రూ.46 కోట్లు చెల్లింపులు
ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.46 కోట్లు చెల్లించారని చెప్పారు. ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని ఏజీ వాదనలు వినిపించారు. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని ఏజీ కోర్టుకు తెలిపారు. అన్ని ఆధారాలు బయటపడతాయన్నారు.
ఈ కేసులో ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిశోర్ వాంగ్మూలం సేకరించినట్లు హైకోర్టుకు తెలిపారు. నిందితులు అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా? అని కోర్టు ప్రశ్నించింది. ఇంత వరకూ నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదన్నారు. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. గవర్నర్ అనుమతితోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని కోర్టుకు తెలిపారు.
ఫిర్యాదుదారు దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే ఆ అధికారులు విధులు నిర్వహించారన్నారు. ఫార్ములా-ఈ రేసింగ్‌కు సంబంధించిన చెల్లింపులు అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారని న్యాయవాది సీపీ మోహన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కేటీఆర్ మంత్రిగా నిర్ణయం తీసుకున్నారని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే నిధులు ఫార్ములా ఈ రేస్ నిర్వహణ సంస్థకు వెళ్లాయన్నారు. ఏసీబీ అధికారులు చెబుతున్న రూ.8 కోట్లు సైతం కేటీఆర్ ఖాతాలోకి వెళ్లవని, నిర్వాహకులకు వెళ్తాయని స్పష్టం చేశారు. బీఎన్‌ఎస్ చట్టం వచ్చాక ఐపీసీ కింద ఎందుకు కేసు నమోదు చేశారని ఏసీబీని హైకోర్టు ప్రశ్నించింది. 14 నెలల కిందటనే నేరం జరిగిందని, అందుకే ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా కోర్టుకు తెలిపారు. అలాగే డబ్బు తీసుకున్న వ్యక్తిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదని కోర్టు ప్రశ్నించింది.
సంబంధిత కథనం