Land Recovery: భూ ఆక్రమణలపై ప్రభుత్వ కొరడా, కలెక్టర్‌కు భూమి అప్పగించిన లక్ష‌్మీపురం మాజీ సర్పంచ్
Land Recovery: భూ అక్రమణలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసులు కొరడా ఝుళిపించారు. పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి ప్రజాప్రతినిధులను రాజకీయ నాయకుల అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం నుంచి పొందిన భూమిని మాజీ సర్పంచ్ తిరిగి అప్పగించడం సంచలనంగా మారింది.
Land Recovery: అక్రమంగా దక్కించుకున్న భూమి వద్దంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మహిళా సర్పంచ్ కలెక్టర్ అప్పగించడం సంచలనం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ 2018లో ప్రభుత్వం నుంచి రెండు ఎకరాల భూమి పొందారు. నిరుపేదనని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడంతో 2018లో ప్రభుత్వం తాడూరు గ్రామ శివారులో సర్వే నెంబర్ 545/1/1/3/1 లో గల 2 ఎకరాల భూమిని తనకు కేటాయించింది.
ఆ భూమిలో అప్పట్లో సర్పంచ్ అయిన రైతు బంధు సైతం పొందారు. అప్పట్లో అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఉండడంతో ఎవరు పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గతంలో బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములు కాజేశారని ప్రచారం జరగడంతో ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో భయపడిన మాజీ సర్పంచ్ పద్మ గతంలో ప్రభుత్వం నుంచి పొందిన రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు.
కలెక్టర్, ఎస్పీకి భూమి పత్రాలు అప్పగింత...
అక్రమంగా ప్రభుత్వం నుంచి భూమి పొందిన మాజీ సర్పంచి పద్మ, ప్రభుత్వం ఇచ్చిన భూమి తనకు వద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు లేఖ రాశారు. వెంటనే స్పందించిన కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో మీడియా సాక్షిగా మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ నుంచి భూమికి సంబంధించిన పాస్ బుక్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
తమకు పూర్వీకుల నుంచి వచ్చిన భూమి ఉండడంతో ప్రభుత్వం ఇచ్చిన భూమి వద్దని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తున్నామని మాజీ సర్పంచ్ పద్మ తెలిపారు. జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదురు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ కోరారు. ప్రస్తుతం మాజీ సర్పంచ్ అప్పగించిన భూమిని పేద ప్రజల సంక్షేమం కోసం, పేదలకు ఇళ్ళ స్థలాల కోసం వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు.
రైతు బంధు రికవరీ...
2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు పొందిన మాజీ సర్పంచ్ పద్మ నుంచి రికవరీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందినందుకు ఆ సొమ్ము రికవరి కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ అన్నారు. ఏటా ఎకరాన 10 వేల చొప్పున పద్మ లక్షా రూపాయల వరకు పొందారని ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని ప్రకటించారు. ఇంతకాలం ప్రభుత్వ భూమిని అక్రమంగా పొంది లబ్ది పొందిన మాజీ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)