Rajanna Sircilla : రోడ్డెక్కిన మాజీ సర్పంచులు.. బిల్లుల కోసం రిలే నిరాహార దీక్షలు-former sarpanch protest for pending bills in rajanna sircilla district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rajanna Sircilla : రోడ్డెక్కిన మాజీ సర్పంచులు.. బిల్లుల కోసం రిలే నిరాహార దీక్షలు

Rajanna Sircilla : రోడ్డెక్కిన మాజీ సర్పంచులు.. బిల్లుల కోసం రిలే నిరాహార దీక్షలు

HT Telugu Desk HT Telugu
Oct 19, 2024 06:09 PM IST

Rajanna Sircilla : మొన్నటి వరకు వారు గ్రామ ప్రథమ పౌరులు. పదవీకాలం ముగియడంతో మాజీలుగా మారారు. ఆ మాజీ సర్పంచులు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కారు. గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేస్తే.. బిల్లుల రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళన చెందుతూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

మాజీ సర్పంచుల ఆందోళన
మాజీ సర్పంచుల ఆందోళన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 254 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో గత ఐదేళ్లలో సర్పంచులు రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులు చేశారు. కొంత ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినప్పటికీ.. మరికొంత గ్రామ సర్పంచులు కలిపి అభివృద్ధి పనులు పూర్తి చేశారు. పనులు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా.. బిల్లులు రాకపోవడంతో చాలామంది సర్పంచులు అప్పులపాలయ్యారు.

చివరకు పదవి కాలం ముగిసి మూడు మాసాలు గడిచింది. అయినా పెండింగ్ బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచులు జాయింట్ యాక్షన్ కమిటీ ( జేఏసీ) గా ఏర్పడి ఆందోళన బాట పట్టారు. అన్ని గ్రామాల నుంచి మాజీ సర్పంచులు సిరిసిల్లకు చేరుకుని.. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

గత ఐదేళ్లలో గ్రామాల్లో పల్లె ప్రగతి కింద.. ఒక్కో గ్రామంలో ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు పనులు చేశామని సర్పంచులు చెబుతున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి.. స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ పనులు చేశామని అంటున్నారు. చేసిన పనులు ఎంబి రికార్డులో నమోదు చేసినా.. బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక సార్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి పత్రాలు సమర్పించినా.. ఎవరు తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

ప్రభుత్వం ఇస్తామంటుంది, కానీ ఇవ్వడం లేదని సర్పంచులు వాపోతున్నారు. అప్పులు తీర్చలేక కొందరు మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 254 గ్రామాల మాజీ సర్పంచులకు భారీగా బిల్లులు రావాలని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner