TS Assembly Elections 2023 : ప్లాన్ మార్చిన 'పొన్నం'... ఈ కారణంతోనే ఆ సీటుపై ఆశలు పెట్టుకున్నారా..?
Former MP Ponnam Prabhakar: కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఈసారి ప్లాన్ మార్చారు. గత ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయన.. ఈసారి హుస్నాబాద్ పై గురి పెట్టారు. అయితే ఆయన ప్లేస్ మారటానికి పలు కారణాలు ఉన్నాయట..!
Husnabad Assembly Constituency: కొద్దిరోజుల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు... వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించగా…కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులను పరిశీలించే పనిలో ఉంది. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేసే దిశగా హస్తం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. భారీగా దరఖాస్తులు రావటంతో…నేతలకు టికెట్ అంశం దడ పుటిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ ఈసారి ప్లాన్ మార్చి… కొత్త సీటుపై కన్నేశారు. అదే సీటును ఆశిస్తూ దరఖాస్తు పెట్టుకున్నారు. ఫలితంగా అక్కడి టికెట్ ను ఆశిస్తున్న మరో నేత టెన్షన్ పడుతుండగా… సీపీఐతో పొత్తు కుదిరితే పరిస్థితేంటన్న చర్చ జోరుగా నడుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
పొన్నం ప్రభాకర్… కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. కరీంనగర్ ఎంపీగా కూడా సేవలు అందించారు. తెలంగాణ కోసం గట్టిగా పోరాడిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత… ఆయన పొలిటికల్ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. 2009 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన… 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అంతేకాకుండా… 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కరీంనగర్ అసెంబ్లీ సీటు నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 39,500 ఓట్లు సాధించిన పొన్నం మూడో ప్లేస్ కే పరిమితమయ్యారు. మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో… పొన్నం ప్రభాకర్ ప్లాన్ మార్చేశారు. ఈసారి కరీంనగర్ నుంచి కాకుండా హుస్నాబాద్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే దరఖాస్తు చేసుకున్నారు.
కారణం ఇదేనా…?
2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ సీటు నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ కు.. 1,79,258 ఓట్లు దక్కాయి. అయితే ఇందులో మెజార్టీ ఓట్లు హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి నుంచే వచ్చాయి. 50 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. దీనికితోడు ఇక్కడ బీసీ సామాజికవర్గానికి చెందిన ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ కూడా బీసీ సామాజికవర్గాని(గౌడ)కి చెందినవారే. ఈ నియోజకవర్గంలో గౌడ్ సామాజికవర్గం ఓట్ల కూడా 35 నుంచి 40 వేల లోపు ఉంటాయని అంచనా. అన్నింటిని అంచనా వేసుకున్న తర్వాతే… పొన్నం ప్రభాకర్ ప్లాన్ మార్చారనే వాదన వినిపిస్తోంది.
ఇక ఇదే టికెట్ పై మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మొన్నటివరకు బీఆర్ఎస్ లో ఉన్న ఆయన… ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. టికెట్ హామీతోనే సొంత గూటికి చేరినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో పొన్నం హుస్నాబాద్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అయిన క్రమంలో… టికెట్ ఫైట్ ముదిరేలా కనిపిస్తోంది. ఒకవేళ పొన్నంకు టికెట్ ఖరారైతే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సహకరిస్తారా..? లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
సొంత పార్టీ నేతల మధ్య ఈ పరిస్థితి ఉంటే… మరో అంశంపై కూడా తెరపైకి వస్తోంది. కాంగ్రెస్ - సీపీఐ మధ్య పొత్తు కుదిరితే హుస్నాబాద్ సీటు కామ్రేడ్ల కోటాలోకి వెళ్లే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ సీటు నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే పొన్నం పరిస్థితేంటన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ హుస్నాబాద్ రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి.
సంబంధిత కథనం