Marri Shasidhar Reddy : కాంగ్రెస్ పార్టీకి మర్రి శశిధర్ రెడ్డి బైబై.. నెక్ట్స్ ఆ పార్టీలోకేనా?-former minister marri shasidhar reddy resigns from congress party ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Former Minister Marri Shasidhar Reddy Resigns From Congress Party

Marri Shasidhar Reddy : కాంగ్రెస్ పార్టీకి మర్రి శశిధర్ రెడ్డి బైబై.. నెక్ట్స్ ఆ పార్టీలోకేనా?

కాంగ్రెస్ పార్టీ మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా
కాంగ్రెస్ పార్టీ మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా

Marri Shasidhar Reddy On Congress : మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మర్రి శశిధర్ రెడ్డి(Marri Shasidhar Reddy) హస్తానికి బైబై చెప్పారు. రాజీనామా లేఖను అధిష్ఠానానికి పంపారు. ఈ పరిణామంపై మీడియాతో మాట్లాడిన శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తనకున్న బంధాన్ని తీవ్ర బాధతో తెంచుకుంటున్నానని అన్నారు. 'నేను ఎప్పుడూ కాంగ్రెస్(Congress)వాదినే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండడంతో ఇలా చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్(TRS) ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. రాష్ట్రమే నా ప్రాధాన్యత.' అని శశిధర్ రెడ్డి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారడానికి తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) పార్టీ ఇన్‌ఛార్జి నేతలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులే కారణమని, తోటి నేతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మర్రి మండిపడ్డారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ(TRS Party)తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించారు. క్రమంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. సోనియా గాంధీ(Sonia Gandhi) కూడా ఏమీ చేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మర్రి శశిధర్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఆరేళ్ల పాటు బహిష్కరించింది. ఆయన హోంమంత్రి అమిత్ షాతో శుక్రవారం దిల్లీలో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.

యూపీఏ(UPA) హయాంలో మర్రి శశిధర్ రెడ్డి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు, కాంగ్రెస్‌తో అనేక దశాబ్దాల అనుబంధం ఉన్న నాయకుడు. శశిధర్ రెడ్డి త్వరలో కాషాయ పార్టీలో చేరే అవకాశం ఉంది.

బీజేపీలో చేరేందుకు శశిధర్‌ రెడ్డి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌(Bandi Sanjay)తో కలిసి మర్రి శశిధర్ రెడ్డి ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. దాదాపు 35 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. మర్రి శశిధర్‌ రెడ్డి కుటుంబ నేపథ్యాన్ని బండి సంజయ్ అమిత్‌షాకు వివరించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని మర్రి శశిధర్ రెడ్డి తెంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హోదాలో మర్రిశశిధర్‌ రెడ్డి పనిచేశారు. యూపీఏ హయంలో కాంగ్రెస్‌ పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పించిన ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్‌ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉంటూ వచ్చారు.

ఈ ఏడాది ఆగస్టులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి శశిధర్ రెడ్డి రాజీనామాతో రెండో నష్టం. పేరున్న నేతలు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని వీడారు. మునుగోడు(Munugode) సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రాజీనామా చేసి.. బీజేపీ(BJP)లోకి జంప్ చేయడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోగా, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.

WhatsApp channel