HarishRao: వరద సహాయక చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విఫలమయ్యాయన్న మాజీ మంత్రి హరీష్‌రావు
HarishRao: ఖమ్మంలో వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. మంగళవారం ఖమ్మం నగరంలో మున్నేరు పరివాహక ప్రాంతాలను సందర్శించారు.
HarishRao: ఖమ్మంలో వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపించారు.
మంగళవారం ఖమ్మం నగరంలో మున్నేరు పరివాహక ప్రాంతాలను సందర్శించి తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మాట్లాడారు.
ఖమ్మం నగరంలో మున్నేరు వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహించినట్లు కనిపిస్తుందన్నారు. వాతావరణ శాఖ అధికారులు గత మూడు రోజుల నుంచి హెచ్చరిస్తున్న జిల్లాలో ఉన్న మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు.
వరద వచ్చి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమన్నారు. ఖమ్మం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో నష్టాలను అంచనా వేయకుండా ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లారని ఆరోపించారు.
మున్నేరు ప్రాంతంలో చూస్తే ఏడుపు వచ్చే సంఘటనలు కనిపిస్తున్నాయని, ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదన్నారు. మంచినీటి, కరెంట్, శానిటేషన్ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని మాకు చెప్పడం జరిగిందన్నారు.
మున్నేరు ముంపు ప్రాంతాలకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తక్షణమే రూ 10 వేల రూపాయలు ప్రకటించడం ఎంతవరకు సమంజసం అన్నారు. ప్రతి ఇంట్లో రూ. 2 నుంచి రూ. 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. మూడు రోజులు గడుస్తున్న పూర్తి స్థాయిలో కరెంట్ వ్యవస్థను పునరుద్ధరించలేదని ఆరోపించారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి, సీతక్క వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని చెప్పారని, ఇప్పుడు మేము అదే చెప్తున్నాం.. మీరు చెప్పిన రూ.25 లక్షలు ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబాలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 30 మంది చనిపోతే, రాష్ట్ర ప్రభుత్వం 16 మంది చనిపోయారని నివేదిక విడుదల చేయడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 8 సీట్లు ఇచ్చిన వారు వరద ముంపు బాధితులకు ఇచ్చింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున విపత్తులు సంభవించినప్పుడు ఎందుకు బీజేపీ ఎంపీ మౌనం వహిస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. చనిపోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు, మున్నేరు ముంపు బాధితులకు రూ. లక్షలు నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రాంతాల్లో తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలను సురక్షితంగా వారి వారి ఇళ్లల్లోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం బీఆర్ఎస్ నేతల వాహనాలపై రాళ్లతో దాడి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు సీపీకి వినతి పత్రం అందించారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.