KTR ACB Case : కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకి వస్తారు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
KTR ACB Case : కేటీఆర్‌పై ఏసీబీ కేసు, ఆయన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో.. తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వ్యవహారంపై తాజాగా మాజీమంత్రి హరీష్ రావు కీలక కామెంట్స్ చేశారు. బంజారాహిల్స్‌లోని కేటీఆర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్.. రేవంత్ రెడ్డి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కేటీఆర్ తెలంగాణ కోసం.. హైదరాబాద్ బ్రాండ్ ఈమేజ్ కోసమే ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చారని.. మాజీమంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అరెస్టయి జైల్లో పడడానికి.. ఈ కేసుకి పొంతనలేదన్నారు. రేవంత్ రెడ్డి డబ్బుల కట్టలతో కెమెరాల ముందు దొరికి జైలుకు పోయారని.. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం కేటీఆర్ అక్రమ కేసుకి పోల్చడం అంటే మోకాలికి బోడి గుండుకి ముడి వేయడమే అని వ్యాఖ్యానించారు.
మీ వెంట పడతాం..
'ఎన్ని రకాల కేసులు పెట్టిన మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పైన వెనకకిపోము. ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా నీ వెంట పడతాం. అక్రమ కేసులతో, అరెస్టులతో మమ్మల్ని బలహీనపరచాలనే రేవంత్ రెడ్డి కుట్ర చెల్లదు. ఎన్ని రకాల కేసులు పెట్టిన రేవంత్ రెడ్డిని వదిలిపెట్టము. ఈరోజు హైకోర్టులో ఇచ్చిన తీర్పు కేసులో అవినీతి జరిగిందని నిర్ధారించలేదు' అని హరీష్ రావు స్పష్టం చేశారు.
తీర్పు కాదు..
'ఈ కేసులో అవినీతి ఉందని శిక్ష వేసిన తీర్పు కాదు. ప్రభుత్వం అవినీతి జరిగింది అని చెప్పినప్పుడు.. విచారణ చేసుకోమని కోర్టు చెప్పింది. గతంలో కూడా కేటీఆర్ విచారణకు సిద్ధమని చెప్పారు. ఈ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే అంశం పైన మా లీగల్ సెల్ నిర్ణయిస్తుంది. హైకోర్టు తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత మా లీగల్ సెల్ సలహా మేరకు తదుపరి కార్యాచరణ చేపడతాం' అని హరీష్ స్పష్టం చేశారు.
సిద్ధంగా ఉన్నాం..
'మొన్న ఏసీబీ దగ్గరికి కూడా విచారణ ఎదుర్కోవడానికి కేటీఆర్ వెళ్లారు. 9వ తేదీన కూడా ఇచ్చిన నోటీసు మేరకు విచారణకు వెళ్తారు. మొన్న 45 నిమిషాలు ఆపినా.. కేటీఆర్ ఓపిగ్గా వేచి చూశారు. కచ్చితంగా విచారణను ఎదుర్కొంటాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడం కోసమే.. ఫార్ములా ఈ కార్ రేసుని కేటీఆర్ హైదరాబాద్ కి తెచ్చారు. ఇదే రేసును తమ రాష్ట్రాలకు, నగరాలకు తీసుకెళ్లడానికి అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయి' అని హరీష్ రావు వివరించారు.
అవినీతి ఎలా అవుతుంది..
'ఒక్క రూపాయి కూడా చేతులు మారనప్పుడు అవినీతి ఎట్లా జరుగుతుంది. కేటీఆర్ అడుగడుగునా రేవంత్ రెడ్డి తప్పిదాలను, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఈ కేసు పేట్టారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. రైతుబంధు ఎగగొట్టడం వల్ల ప్రజల నుంచి ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది. అన్ని సర్వే రిపోర్టులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నాయి' అని హరీష్ వ్యాఖ్యానించారు.
ఎప్పుడూ ప్రజల పక్షమే..
'అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మేము ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షమే. కేటీఆర్ కడిగిన ముత్యంల బయటకి వస్తారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి.. విచారణకి వెళ్తాం. మాకు అధికారులపైన, కోర్టుల పైన విశ్వాసం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డిపైన లేదు. కోర్టులో వచ్చిన తీర్పు పైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైకోర్టు చెప్పింది కేవలం విచారణ మాత్రమే చేయమని' అని హరీష్ రావు వివరించారు.
తప్పుడు ప్రచారం..
'విచారణ ప్రారంభం కాకముందే తప్పు జరిగిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కొంతమంది హైకోర్టు తీర్పును తప్పుడుగా వక్రీకరిస్తున్నారు. కేటీఆర్ పైన పెట్టిన కేసు తుఫెల్ కేసు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పైన చిచ్చర పిడుగుల్లా పోరాడిన చరిత్ర మాది. గతంలో అరెస్టై కేటీఆర్ వరంగల్ జైల్లో ఉన్నారు. గ్రీన్ కోకి రూపాయి లబ్ధి చేయనప్పుడు.. వారు ఎందుకు మాకు తిరిగి డబ్బులు ఇస్తారు. అదే గ్రీన్కో కంపెనీ.. ఫార్ములా అయ్యే నిర్వహణలో భారీగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి నుంచి డబ్బులు వచ్చాయనడం అర్థరహితం' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.