Harish Rao : బూటకపు వాగ్దానాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
Harish Rao : రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. విజయోత్సవాలు అంటూ ఈ బూటకపు ఎన్‌కౌంటర్లు ఏంటని ప్రశ్నించారు. ములుగు జిల్లాలో తాజాగా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ఏడాది విజయోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుంటే.. ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది? అని మాజీమంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు, బూటకపు ఎన్ కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలను మోసం చేసి ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని విమర్శించారు. ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడిచారని ఎద్దేవా చేశారు. బూటకపు వాగ్దానాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు అంటూ ట్వీట్ చేశారు.
ములుగు జిల్లాలో తాజాగా ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఏజెన్సీ ఏరియాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ బలగాలు , మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు. ఇందులో ఇద్దరు కీలక నేతలు ఉన్నారు.
ఘటనాస్థలి నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా పోలీసుల నుంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఎన్ కౌంటర్ ను ములుగు జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు. ఇక ఈ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం… ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయినవారి పేర్లు బయటికి వచ్చాయి.
కుర్సుం మంగు అలియా బద్రు అలియాస్ పాపన్న, TSCM కార్యదర్శి, ఇల్లందు నర్సంపేట.
మల్లయ్య అలియాస్ మధు, డీవీసీఎం కార్యదర్శి, ఏటూరు నాగారం - మహాదేవ్ పురం డివిజన్.
కరుణాకర్ , ఏసీఎం.
జమునా - ఏసీఎం.
జైసింగ్ - పార్టీ మెంబర్.
కిషోర్ - పార్టీ సభ్యుడు.
కామేశ్ - పార్టీ సభ్యుడు.
మరోవైపు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 24వ వార్షికోత్సవాలను డిసెంబర్ 2 నుండి 8 వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. కొయ్యూరు ఎన్ కౌంటర్ కు పాతికేళ్లు అవుతున్న నేపథ్యంలో వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విప్లవోద్యమ నిర్మూలనకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ‘కగార్’ విప్లవ ప్రతీఘాతుక యుద్ధాన్ని తిప్పికొడుతామని ప్రకటించింది.