Telangana Politics : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం : హరీష్ రావు
Telangana Politics : రేవంత్ సర్కారుపై హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. 14 నెలల పాలనలో దరఖాస్తులు తీసుకోవడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కారణంగా ఎంతోమంత్రి ప్రాణాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కుమ్మరి నాగయ్య మృతికి ప్రభుత్వమే కారణమని వ్యాఖ్యానించారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం అని వ్యాఖ్యానించారు. ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని అన్నారు. లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని.. గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు కుమ్మరి నాగయ్య.
ముమ్మాటికి ప్రభుత్వ హత్యే..
'పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖం చాటేస్తే.. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. నాగయ్యకు మంచి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడేందుకు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రయత్నించింది. కానీ దురదృష్టవశాత్తు నాగయ్య ప్రాణాలు వదిలారు. తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ.. పురుగుల మందు తాగి, ఆసుపత్రి పాలైన నాగయ్య దుస్థితికి ప్రభుత్వమే కారణం. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య' అని హరీష్ రావు ఆరోపించారు.
నిప్పులు పోసింది కాంగ్రెస్..
'ఉన్నదాంతో తనవారిని పోషిస్తూ జీవితం గడుపుతున్న నాగయ్య కుటుంబంలో.. గ్రామ సభల పేరిట నిప్పులు పోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. భర్తను, తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న భార్య, ముగ్గురు ఆడబిడ్డలను ఎవరు ఆదుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో.. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా.. లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా.. జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపింది కాంగ్రెస్ పార్టీ' అని హరీష్ విమర్శించారు.
భస్మాసుర హస్తం..
'కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు.. కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటిస్తున్నారు. దీంతో గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందళన మొదలైంది. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప.. ఏడాది పాలనలో మీరు చేసిందేముంది. గ్రామ సభల సాక్షిగా తిరగబడ్డ జనం, ఎక్కడిక్కడ నిలదీసిన దృశ్యాలు.. మీ 14 నెలల పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపాయి. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం' అని విమర్శించారు మాజీమంత్రి.
ధైర్యం కోల్పోవద్దు..
'రోడ్డున పడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని.. రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలారా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదాం. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.