Smartcity Funds: స్మార్ట్‌సిటీ నిధులు దారి మళ్ళింపు, అక్రమాలపై పోలీసులకు మాజీ మేయర్ ఫిర్యాదు
Smartcity Funds: కరీంనగర్ నగరపాలక సంస్థ అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. స్మార్ట్ సిటీ నిధులు దారి మళ్ళీంచారు. తిలా పాపం తల పిడికెడు అన్నట్లు పంచుకు తిన్నారు.
Smartcity Funds: ఎన్నికల ముందు అభివృద్ధి జపంతో అదరగొట్టిన బిఆర్ఎస్ నేతలకు స్వపక్షంలోనే విపక్షం తయారు కావడం అవినీతి ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడం అటు బల్దియా అధికారులను ఇటు పాలకవర్గాన్ని ఇరకాటంలో పడేస్తోంది.
ప్రభుత్వం మారడంతో పలచబడుతున్న బీఆర్ఎస్ పార్టీకి బల్దియాలో అవినీతిపై మాజీ మేయర్ ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అవినీతి అక్రమాలు ఇప్పుడు అధికారుల మెడకు చుట్టుకోనున్నట్లు తెలుస్తోంది. బల్దియాలో ఏం జరుగుతుందనేది సర్వత్రా చర్చ సాగుతోంది.
కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న తంతుపై పాలకవర్గం నేతలే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు నోరు మెదపని పాలకవర్గం కార్పొరేటర్లు ఇప్పుడు నిధుల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ.. అధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ అధికారులపై మండిపడడమే కాకుండా, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది.
ఇటీవల పాలకవర్గం కార్పొరేటర్లతో పాటు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సైతం బల్దియాలో జరిగిన అవినీతిపై బహిరంగంగా విమర్శలు చేయడమేకాదు ఏకంగా పోలీస్ లకు పిర్యాదు చేశారు. స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు.
ఆధారాలతో కూడిన ఫిర్యాదును అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను కేటాయించి అక్రమాలకు పాల్పడ్డారని.. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం మంజూరీ చేసిన ఈ పథకం అమలులో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయిస్తుందని... ఈ నిధులను కేవలం నగర పరిధిలో మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని నిబంధనల్లో స్పష్టంగా ఉందన్నారు.
నిధులను ఇతర ప్రయోజనాల కోసం మళ్లించకూడదని... ఖర్చు చేసిన డబ్బు, నిర్వహించిన పనుల వివరాలను, ప్రతి పనికి ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుందన్నారు. నగరంలో నిధులను వేరే పనులకు మళ్లించి పక్కదారి పట్టిస్తున్నట్లు తెలిసిందని ... నిధుల దుర్వినియోగం చట్టంలో శిక్షార్హమైనదని రవీందర్ సింగ్ వివరించారు.
నగరాన్ని ఆనుకొని ఉన్న బొమ్మకల్ జంక్షన్ అభివృద్ధి కోసం 2022 ఆగస్టు8న టెండర్లు పిలిచారని బొమ్మకల్ గ్రామం కరీంనగర్ సిటీ పరిధిలో లేదని.. స్మార్ట్ సిటీ పనుల పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. ఇదంతా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ (బీఎంసీ) మున్సిపల్ కార్పొరేషన్, సిటీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కలిసి కరీంనగర్ స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఉద్దేశించిన నిధులను పక్కదారి పట్టించేందుకు పథకం పన్నారని రవీందర్ సింగ్ ఆరోపించారు.
నగరానికి సంబంధించిన నిధులతో గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడం నిబంధనలకు విరుద్దమన్నారు. సదరు టెండర్ల ద్వారా పనులు పొందిన కాంట్రాక్టర్ ఇప్పటికే 25 శాతం పనులు పూర్తి చేసి నిధులు పక్కదారి పట్టించారన్నారు. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందన్నారు. ఇందుకు కారణమైన మున్సిపల్ కమిషనర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీతో పాటు ఈ అక్రమాల్లో పాలుపంచుకున్న ఇతరులపై చట్ట ప్రకారం చర్యతీసుకోవాలని రవీందర్ సింగ్ కోరారు.
నిధుల పక్కదారి వెనుక ఉన్న నేత ఎవరు?
కరీంనగర్ నగర పాలక సంస్థ స్మార్ట్ సిటీ హోదా లభించిన తర్వాత నగర అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ నిధులతో అధికారులు నగరంలోని డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.
కానీ నామమాత్రంగా నగరాన్ని అభివృద్ధి చేసిన అధికారులు స్మార్ట్ సిటీ నిధులను గ్రామపంచాయతీలకు తరలించడం వెనుక బడా నేతల ప్రమయం ఉందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిధులను పక్కదారి పట్టించడంపై పాలకవర్గం కార్పొరేటర్లే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అయితే నగరానికి ఆనుకుని ఉన్న బొమ్మకల్ గ్రామాన్ని కార్పోరేషన్ లో కలిపి ఓ నేత రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసేందుకు అప్పటి ప్రభుత్వంలో ఓ ప్రధాన నాయకుడి కనుసన్నల్లో నిధులను నగరంలో కాకుండా గ్రామ పంచాయితీలో పనులు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా అధికారుల తీరు
కరీంనగర్ నగరపాలక సంస్థకు స్మార్ట్ సిటీ కింద విడుదలైన నిధులను, నగరపాలక సంస్థ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పక్కదారి పట్టించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు ఏ ఉద్దేశంతో నిధులను పక్కదారి పట్టించారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.
అధికారులే ఈ తతంగానికి పాల్పడ్డారా లేదా ఎవరైనా బడా నేతలు అధికారులతో ఈ పని చేయించారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవినీతికి పాల్పడిన అధికారులపై ఉన్నతాధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే..
సెలవులపై మున్సిపల్ కమిషనర్....
నగరంలోని స్మార్ట్ సిటీ నిధులలో చోటుచేసుకున్న అక్రమాలపై నోరు విప్పాల్సిన కమిషనర్ సెలవులపై వెళ్లినట్లు సమాచారం. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని నిధుల దుర్వినియోగానికి పాల్పడి, సమాధానం చెప్పలేక సెలవులపై వెళ్లినట్లు పాలక వర్గం కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. నిధుల దారి మళ్ళింపు... స్మార్ట్ సిటీ పనుల అక్రమాలు ఎటువైపు దారితీస్తాయోనని సర్వత్రా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)