TG New Ration Cards : రేషన్‌ కార్డుల జాబితాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పేరు.. అవాక్కైన ప్రజలు!-former brs mla peddi sudarshan reddy name in the list of new ration cards ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg New Ration Cards : రేషన్‌ కార్డుల జాబితాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పేరు.. అవాక్కైన ప్రజలు!

TG New Ration Cards : రేషన్‌ కార్డుల జాబితాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పేరు.. అవాక్కైన ప్రజలు!

Basani Shiva Kumar HT Telugu
Jan 23, 2025 09:30 AM IST

TG New Ration Cards : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా రేషన్ కార్డులపైనే చర్చ జరుగుతోంది. అధికారులు గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తూ.. జాబితాను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే పేరు రేషన్ కార్డుల జాబితాలో ప్రత్యక్షమైంది.

రేషన్‌ కార్డుల జాబితాలో మాజీ ఎమ్మెల్యే పేరు
రేషన్‌ కార్డుల జాబితాలో మాజీ ఎమ్మెల్యే పేరు

రాష్ట్రంలో నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి అధికారులు గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక జాబితాలో వచ్చిన పేర్లను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలో గ్రామసభ నిర్వహించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను కార్యదర్శి ధర్మేందర్‌ చదివి వినిపించారు.

పెద్ది చిరునామాతో..

అయితే.. రేషన్‌ కార్డుల జాబితాను పరిశీలించగా అందులో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి పేరు కనిపించింది. దీంతో అక్కడికి వచ్చిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దరఖాస్తు-ఐడీ నంబర్ 18608965 తో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు కనిపించింది. ఆ దరఖాస్తు పెద్ది సుదర్శన్‌ రెడ్డి చిరునామాతో కూడిన ఇంటి నంబర్ 6-86, లెంకాలపల్లి రోడ్డు, నల్లబెల్లి పేరుతో ఉంది.

ఆన్‌లైన్‌లో..

ఆ వివరాల్లో ఫోన్ నంబరు కూడా ఆయనదే ఉంది. అయితే.. ఈ దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించినట్టు అధికారులు భావిస్తున్నారు. పెద్ది సుదర్శన్‌ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కావడంతో.. ఆ దరఖాస్తు తిరస్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గతంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా, నర్సంపేట ఎమ్మెల్యేగా పదవులు అనుభవించారు. అలాంటి నేత పేరుతో రేషన్‌ కార్డు దరఖాస్తు ఉండటం చర్చనీయాంశంగా మారింది.

అధికారులకే తెలియాలి..

రేషన్ కార్డుల జాబితాలో తనపేరు రావడంపై పెద్ది సుదర్షన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను దరఖాస్తు చేయలేదని స్పష్టం చేశారు. జాబితాలో తన పేరు ఎలా వచ్చిందో అధికారులకే తెలియాలని సెటైర్లు వేశారు. మీసేవా ద్వారా 85 అప్లికేషన్లు వచ్చాయని, వాటిల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరుతో దరఖాస్తు వచ్చినట్టు ఉందని అధికారులు చెబుతున్నారు.

నిరసనలు..

వరంగల్ జిల్లాలో గ్రామ, వార్డు సభలు కొన్నిచోట్ల గందరగోళంగా జరిగాయి. కులగణన ఆధారంగా తయారు చేసిన ప్రాథమిక జాబితాలో అర్హుల పేర్లు లేవని నిరసిస్తూ ప్రజలు అధికారులను నిలదీశారు. కొన్నిచోట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలస్యంగా వచ్చారు. దీంతో అనుకున్న సమయానికి సభలు మొదలు కాలేదు. లబ్ధిదారులు ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభల్లో జాబితాలను అధికారులు చదివి వినిపిస్తుండగా.. ఎక్కువ మంది పేర్లు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల ఆగ్రహం..

కొన్ని చోట్ల తమ పేర్లకు బదులు.. అధికార పార్టీల నాయకుల అనుచరుల పేర్లు ఉన్నాయని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. పేర్లు లేని లబ్ధిదారులు దరఖాస్తులు సమర్పించాలని.. అధికారులు సూచించారు. అయితే.. ప్రజాపాలన, కులగణన, ఇంటింటి సర్వేల్లో సమర్పించిన దరఖాస్తుల సంగతేంటని ప్రజలు ప్రశ్నించారు. ఇదంతా కాలయాపన కోసమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Whats_app_banner