Telugu News  /  Telangana  /  Forest Rangers Want Their Guns Back In Telangana State Over Brutal Murder Of Srinivasa Rao
అటవీ అధికారులకు తుపాకులు ఇస్తారా..?
అటవీ అధికారులకు తుపాకులు ఇస్తారా..?

Guns For Forest Guards: ఫారెస్ట్ అధికారుల గన్స్ ఎందుకు రద్దు చేశారు? కారణాలేంటి?

25 November 2022, 14:19 ISTMahendra Maheshwaram
25 November 2022, 14:19 IST

Attacks On Forest Officers in Telangana: భద్రాద్రి జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాసరావును అత్యంత దారుణంగా హత్య చేశారు గుత్తి కోయలు. ఇది దేశంలోనే అత్యంత సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులకు తుపాకీలు ఇవ్వాల్సిందేనన్న వాదన మరోసారి తెరపైకి వచ్చింది. లేకపోతే విధులు నిర్వర్తించలేమంటూ సిబ్బంది కూడా తేల్చి చెబుతోంది. అసలు గతంలోని పరిస్థితేంటి..? ప్రస్తుతం ఆయుధాలు ఇవ్వాల్సిందేనా..? అటవీ అధికారులకు తుపాకీల ఇవ్వాల్సిన అవసరం ఎంతవరకు ఉంది వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి.

Attacks On Forest Rangers: 'మళ్లీ మాకు తుపాకులు ఇవ్వండి(“Give back our guns!”)'... ఇది తెలంగాణలో పని చేస్తున్న అటవీ శాఖ సిబ్బంది నినాదం. కొన్నేళ్లుగా ఈ డిమాండ్ చేసినప్పటికీ... తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చింది. ఫారెస్ట్‌ రేంజర్‌ అధికారి శ్రీనివాసరావును గొడ్డలతో అత్యంత దారుణంగా హత్య చేయటం సంచలనంగా మారింది. ఇక తమకు తుపాకీలు ఇవ్వాల్సిందేనని.. లేకపోతే విధులు నిర్వర్తించటం కష్టమని అంటున్నారు సిబ్బంది. పోడు భూముల ప్రభావం ఉన్న జిల్లాల్లో పూర్తిగా విధులు చేయలేమని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... అసలు అటవీ శాఖ సిబ్బందికి ఎందుకు తుపాకులు లేవు..? గతంలో ఉండేవా..? ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ.. ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయి..? దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందా.? కోర్టులు ఎప్పుడైనా జోక్యం చేసుకున్నాయా..? వంటి అంశాలను పరిశీలిస్తే......

ట్రెండింగ్ వార్తలు

అటవీశాఖ అధికారులపై ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగానూ చాలా చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. పలుచోట్ల ఏకంగా హత్యలు చేయబడ్డారు. ఇక తెలంగాణలో పరిశీలిస్తే.. గత కొంత కాలంగా దాడుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇటీవల కుమ్రంభీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారిణి అనితపై ఓ ప్రజాప్రతినిధి సోదరుడి ఆధ్వర్యంలో దాడి జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా గంగారాం మండలం మడగూడెంలో పోడు భూముల సాగును అడ్డుకున్న డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ కర్ణానాయక్‌ పై దాడి జరిగింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు అత్యంత చర్చనీయాశంగా మారాయి. ఇవే కాకుండా చాలా చోట్ల కూడా దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి.

గతంలో ఆయుధాలు...

నిజానికి అటవీశాఖ సిబ్బందికి గతంలో ఆయుధాలు ఉండేవి. తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉండేది. ఈ క్రమంలో వారు.. అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడి చేసి ఆయుధాలను దోచుకునేవారు. వైర్ లెస్ సెట్లు కూడా తీసుకొనేవారు. ఈ క్రమంలో 28 ఏళ్ల కిందట నాటి సర్కార్... అటవీశాఖ సిబ్బంది ఆయుధాలను రద్దు చేసింది. వారి వద్ద నుంచి వెనక్కి తీసుకొని పోలీసులకు అప్పగించింది. ఇక నాటి నుంచి కేవలం కర్రలతోనే విధులు నిర్వర్తిస్తున్నారు అటవీశాఖ సిబ్బంది. అనంతర కాలంలో అడవిపై స్మగ్లర్ల కన్నుపడటం, చెట్ల నరికివేత, అటవీ భూముల అక్రమణ, చెట్ల పెంపకం, పట్టాల వంటి సమస్యలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో అటవీశాఖ సిబ్బందిపై దాడులు పెరుగుతూ వచ్చాయి. ఇది కాస్త హత్యల వరకు దారి తీసినట్లు అయింది.

సుప్రీం ఆందోళన...

అటవీశాఖ అధికారులపై వేటగాళ్లు, స్మగ్లర్లు, గిరిజనులు చేస్తున్న దాడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. గతేడాది జనవరిలో ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. స్మగ్లర్లు, వేటగాళ్ల నుంచి రక్షణ పొందేందుకు అటవీ సిబ్బందికి అవసరమైతే తుపాకులు, బుల్లెట్​ ప్రూఫ్​ దుస్తులు, శిరస్త్రాణాలను అందించే ఉత్తర్వులనూ జారీ చేయొచ్చని చెప్పింది. ఈ విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ ఓ నివేదికను కూడా కోర్టుకు సమర్పించారు. అటవీశాఖ అధికారులపై జరిగే దాడుల్లో 38 శాతం భారత్​లోనే నమోదయ్యాయని ప్రస్తావించారు. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర అడవుల్లో వెలుగుచూసిన దారుణమైన దాడులు అంశాలను పేర్కొన్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో స్పందించిన నాటి సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ధర్మాసనం... అటవీశాఖపై ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కూడా కేంద్రానికి సూచించింది. వారి రక్షణపై కూడా పలు ప్రశ్నలు సంధించింది.

ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ అటవీశాఖ అధికారులపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ అధికారులను హతమార్చడం అప్పట్లో పెద్ద సంచలనం. అంతకు ముందు నిజామాబాద్‌తోపాటు జిల్లాలోని పెంబి అడవుల్లో సత్యనారాయణ అనే బీట్ ఆఫీసర్‌ను దారుణంగా హత్య చేశారు. ఇవే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల అటవీ ప్రాంతాల్లో చాలాచోట్ల దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. వీటిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తుపాకీలు మళ్లీ ఇచ్చేందుకు కసరత్తు జరిగినప్పటికీ అమల్లోకి రాలేదు. అనంతరం రాష్ట్రవిభజన జరగటం వంటివి జరిగిపోయాయి.

ప్రస్తుతం శ్రీనివాసరావు దారుణ హత్య నేపథ్యంలో మరోసారి ఆయుధాల అందజేత అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. అటవీ సిబ్బంది రక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తుపాకులు ఇచ్చి శిక్షణ అందజేసే దిశగా హోంశాఖ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రేపోమాపో సర్కార్ నుంచి ఉత్తర్వులు వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు పోడు భూముల అంశాన్ని పరిష్కరించేందుకు కూడా సర్కార్ నిర్ణయం తీసుకుంది. 12.46 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కుల కల్పనకు సంబంధించి గిరిజనుల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పట్టాల పంపిణీపై కూడా ఆసక్తి నెలకొంది.