కోరుట్లలో ఐదేళ్ల బాలిక హత్య - కుటుంబ సభ్యులపై అనుమానాలు..! అసలేం జరిగింది...?-five year old child murdered in korutla town in jagityala district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కోరుట్లలో ఐదేళ్ల బాలిక హత్య - కుటుంబ సభ్యులపై అనుమానాలు..! అసలేం జరిగింది...?

కోరుట్లలో ఐదేళ్ల బాలిక హత్య - కుటుంబ సభ్యులపై అనుమానాలు..! అసలేం జరిగింది...?

కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఐదేళ్ల చిన్నారి… హత్యకు గురైంది. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.

కోరుట్లలో దారుణం - చిన్నారి హత్య

జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆదర్శనగర్‌లో శనివారం సాయంత్రం తర్వాత దారుణం వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటూ 5 ఏళ్ల హితక్ష కనిపించకుండా పోయింది. చుట్టుపక్కన ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కాసేపటికే అదే కాలనీలోని ఓ ఇంట్లోని బాత్ రూములో రక్తపు మడుగుల్లో పడి ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే…?

ప్రాథమిక వివరాల ప్రకారం….. ఆదర్శనగర్‌ కాలనీకి చెందిన ఆకుల రాము-నవీన దంపతులకు ఇద్దరు సంతానం. రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లారు. నవీన పిల్లలతోపాటు ఇక్కడే ఉంటున్నారు. వీరి కూతురు హితీక్ష(5) శనివారం సాయంత్రం పాఠశాలకు నుంచి తిరిగొచ్చాక ఇంటి బయట ఆడుకుంటోంది. ఆ తర్వాత ఇంటికి రాలేదు.

దీంతో అప్రమత్తమైన తల్లి… చుట్టపక్కల ప్రాంతంలో వెతికింది.సమాచారం తెలియకపోవటంతో…. స్థానిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వచ్చి చుట్టుపక్కల ఇళ్లలో వెతికారు. అదే కాలనీలో నివసించే విజయ్‌ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని బాత్ రూమ్ లో బాలిక రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ… అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసులో విజయ్‌ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా లోతుగా విచారణ జరుపుతున్నారు.

కేసులో కొత్త కోణం….?

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హితీక్ష హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసినట్లు సమాచారం. హితీక్ష హత్య కేసులో కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారి పిన్నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్యకు దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.