రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్‌ తప్పనిసరి - 5 వేల మంది సర్వేయర్లు వచ్చేస్తున్నారు..!-five thousand licensed surveyors will soon be available in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్‌ తప్పనిసరి - 5 వేల మంది సర్వేయర్లు వచ్చేస్తున్నారు..!

రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్‌ తప్పనిసరి - 5 వేల మంది సర్వేయర్లు వచ్చేస్తున్నారు..!

తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి రావటంతో… కీలక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. దీంతో సర్వేయర్లు కీలకంగా మారనున్నారు. ఈ నేపథ్యంలో తొలి విడ‌త‌ కింద 5 వేల మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను తీసుకువచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది.

స‌ర్వేయ‌ర్ల నియామ‌కం (unsplash.com)

తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి రావటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద పలు మండలాల్లో ఈ చట్టం ప్రకారమే సేవలు అందుబాటులో రాగా… త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో సేవలు ప్రారంభం కానున్నాయి. కొత్త చట్టం ప్రకారం… భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే సర్వే మ్యాప్ తప్పనిసరి. కాబట్టి….సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తెలంగాణ కసరత్తు చేస్తోంది.

త్వరలోనే 5 వేల మంది సర్వేయర్లు….!

రాష్ట్రంలో భూస‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌క్ష్యంగా లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల నియామ‌కం చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడ‌త‌ కింద ఐదు వేల మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను తీసుకోబోతున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి కాగా…. వీరందరికీ మే 26వ తేదీ నుంచి ఆయా జిల్లా కేంద్రాల్లోనే శిక్ష‌ణా కార్యక్ర‌మాల‌ను నిర్వహించనున్నారు.

సర్వేయర్లకు ఎంపికైన వారికి రెండు నెల‌ల పాటు వీరికి శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ారు. శిక్ష‌ణ పూర్తైన‌ వెంట‌నే ఆయా మండలాల్లో భూవిస్తీర్ణం , భూ లావాదేవీల‌ను బ‌ట్టి ఆరు నుంచి ఎనిమిది మంది స‌ర్వేయ‌ర్ల‌ను నియ‌మించనున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా వెల్లడించారు.

సర్వే మ్యాప్ తప్పనిసరి…

రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో ఎమ్మార్వో, స‌బ్ రిజిస్ట్రార్ ద‌గ్గ‌ర భూముల‌కు సంబంధించిన డాక్యుమెంట్ల‌తోపాటు స‌ర్వే పత్రాన్ని కూడా జ‌త ప‌ర‌చాల‌ని భూభార‌తి చ‌ట్టంలో పేర్కొన‌డం జ‌రిగింది. ఇందుకు అనుగుణంగానే స‌ర్వే విభాగాన్ని పూర్తి స్ధాయిలో బ‌లోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో నిజాం కాలం నుంచి సర్వే జ‌ర‌గ‌ని ,ఇప్ప‌టివ‌ర‌కు స‌ర్వే రికార్డులు లేని 413 న‌క్షా గ్రామాల‌లో రీస‌ర్వే చేప‌ట్టనున్నారు. ఇందులో భాగంగా ప్ర‌యోగాత్మ‌కంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా గండీడ్ మండ‌లం స‌లార్ న‌గ‌ర్ , జగిత్యాల్ జిల్లా భీర్పూర్ మండ‌లం కొమ్మ‌నాప‌ల్లి ( కొత్త‌ది) గ్రామం, ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెం మండ‌లం ములుగుమ‌డ , ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి జిల్లా వ‌ట్ప‌ల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాలను ఎంపిక చేశారు.

ఈ ఐదు గ్రామాల్లో ముందుగా గ్రామసభలు నిర్వ‌హించి స‌ర్వేకు సంబంధించిన అంశాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించారు. నెల‌రోజుల్లో ఈ సర్వే ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని ప్రభుత్వం…. అధికారుల‌ను ఆదేశించింది. దీంతో అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో సర్వే విజయవంతమైన తర్వాత… రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో సర్వేకు సిద్ధమయ్యే అవకాశం ఉంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం