Warangal : యువతిని వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం.. ఐదుగురికి ఏడేళ్లు జైలు శిక్ష-five people sentenced to seven years in prison for trying to lure a young woman into prostitution ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : యువతిని వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం.. ఐదుగురికి ఏడేళ్లు జైలు శిక్ష

Warangal : యువతిని వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం.. ఐదుగురికి ఏడేళ్లు జైలు శిక్ష

HT Telugu Desk HT Telugu

Warangal : తల్లిదండ్రులు లేని ఓ యువతిని టార్గెట్ చేసి, వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం చేశారు. ఈ కేసులో వరంగల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు దుండగులకు వరంగల్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 6 వేల రూపాయల ఫైన్ విధించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యువతిని వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం (istockphoto)

గద్వాల జిల్లా మల్దకల్ మండలానికి చెందిన ఓ యువతికి తల్లిదండ్రులు లేరు. ఆమె తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంది. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఓ ప్రైవేటు కంపెనీలో టెలీ కాలర్‌గా వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేయడం ప్రారంభించింది. కానీ టెలీ కాలర్‌గా పని చేయడం వల్ల వచ్చే ఆదాయం సరిపోకపోలేదు. ఇంకా ఏదైనా జాబ్ చేయాలని నిర్ణయించుకుంది.

బస్టాండ్‌లో మాటలు కలిపి..

ఉద్యోగం కోసం గతేడాది మార్చి 10న ఉదయం హైదరాబాద్ మహానగరానికి చేరుకున్న యువతి.. ఎంజీబీఎస్ బస్టాండ్‌లో దిగింది. ఈ క్రమంలో అక్కడ ఓ ఇద్దరు అమ్మాయిలు ఉండగా.. వారు మెల్లిగా బాధిత యువతితో మాట కలిపారు. పరిచయం పెంచుకుని, యువతి వివరాలు తెలసుకున్నారు. ఎక్కడికి వెళ్లాలో ఆరా తీయగా.. బాధిత యువతి తాను దిల్‌సుఖ్‌నగర్ వెళ్లాల్సిందిగా సమాధానం ఇచ్చింది.

యువతిని నమ్మించి..

తాము కూడా అటు వైపే వెళ్తున్నామని నమ్మించి, ఆమెను హయత్‌నగర్ వైపు తీసుకెళ్లారు. అక్కడ వారి తల్లి పాకనాటి మమత ఉండగా.. ఆమెకు పరిచయం చేశారు. అప్పటికే మధ్యాహ్నం కావడంతో భోజనం చేశాక దిల్‌సుఖ్‌నగర్ తీసుకెళ్తానని ఆమెకు చెప్పారు. సాయంత్రం కాగా అప్పటికే లేట్ అయ్యిందని, మరుసటి రోజు తమ పిన్ని చందన వస్తుందని, ఆమె దిల్‌సుఖ్‌నగర్ తీసుకెళ్తుందని చెప్పడంతో నమ్మిన ఆ యువతి అక్కడే నిద్రించింది.

వ్యభిచార కూపంలోకి నెట్టే ప్లాన్..

12వ తేదీ ఉదయం చందన అక్కడికి చేరుకోగా.. ఇక దిల్‌సుఖ్‌నగర్ వెళ్లేందుకని బాధిత యువతి రెడీ అయ్యింది. చందన ఆమెపై దాడికి దిగి, వ్యభిచారం చేయాల్సిందిగా బలవంతం చేసింది. అక్కడి నుంచి వెళ్లిపోకుండా అడ్డుకుంది. 13వ తేదీన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహడ్ గ్రామానికి చెందిన పాకనాటి శివమ్మ అనే మహిళను అక్కడికి రప్పించి.. యువతిని ఆమెకు అప్పగించారు.

పోలీసులకు ఫిర్యాదు..

ఆమె సదరు యువతిని కారులో వంగపహడ్ తీసుకుని వచ్చి.. శ్యాంరావ్ కావ్య ఇంట్లో పెట్టి వ్యభిచారం చేయాల్సిందిగా బలవంతం చేసింది. వారి నుంచి తప్పించుకున్న ఆ యువతి నేరుగా హసన్‌పర్తి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి.. తగిన సాక్ష్యాధారాలను కోర్టు సమర్పించారు. వాదోపవాదాలు విన్న కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితురాలు ముగ్దంగుల చందన, పాకనాటి శివమ్మ, పాకనాటి మమత, శ్యాంరావ్ కావ్య, డ్రైవర్ అన్వేష్‌ను దోషులుగా తేల్చింది. వారికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధించింది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

HT Telugu Desk