Yadadri district : యాదాద్రి జిల్లాలో విషాదం - చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు యువకులు మృతి
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున అదుపు తప్పిన ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మృతులను హైదరాబాద్ లోని హయత్ నగర్ కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్ లుగా గుర్తించారు. మణికంఠ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ప్రాథమిక వివరాల ప్రకారం… ఈ ప్రమాదం ఉదయం 5 గంటలకు జరిగినట్లు తెలిసింది. 5. 27 గంటలకు పోలీసులకు సమాచారం అందటంతో…. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఐదు మంది చనిపోగా… మేడబోయిన మణికంఠ యాదవ్(21) ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే మద్యం మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మృతుల వివరాలు :
- బాలు (19) - ఎల్బీ నగర్
- హర్ష (21) - ఎల్బీ నగర్
- దినేశ్ (21) - ఎల్బీ నగర్
- వంశీ గౌండ్ (23) - ఆర్టీసీ కాలనీ, ఎల్బీ నగర్
- డ్రైవర్ కూడా చనిపోయాడు.
- మణికంఠ యాదవ్ ప్రాణాలతో బయటపడ్డారు. ఇతను రామన్నపేటకు చెందిన వాడు కాగా… ప్రస్తుతం బోడుప్పల్ ఉంటున్నాడు.
ఆరు మంది కారులో వెళ్తుండగా… జలాల్‌పూర్ చెరువు సమీపంలోని క్రాస్ వద్ద కారు అదుపు తప్పింది. నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. శుక్రవారం రాత్రి మద్యం సేవించినట్లు ప్రాథమికంగా తేలింది. కేసు నమోదు చేసుకున్న పోచంపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన మణికంఠ నుంచి వివరాలను సేకరిస్తున్నారు.