Gajwel railway station : గజ్వేల్ రైల్వేస్టేషన్‌లో నేటి నుంచి రైళ్ల రాకపోకలు
Gajwel railway station: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గ కేంద్రం గజ్వేల్ రైల్వే స్టేషన్‌కు నేటి నుంచి గూడ్స్ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. గజ్వేల్ పట్టణంలోకి కొత్తగా ఏర్పాటు చేసిన ఎరువుల రేక్ పాయింట్‌కు సరుకు రవాణా చేసేందుకు వీలుగా నిర్మాణాలు పూర్తి చేశారు. గజ్వేల్ రైల్వేస్టేషన్‌కు వచ్చే మొదటి గూడ్స్ రైలుకు తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి స్వాగతం పలుకనున్నారు.

కేసీఆర్ సొంత నియోజక వర్గం గజ్వేల్‌కు సోమవారం మొదటి గూడ్స్ రైలు రానుంది. కాకినాడ నుంచి 12 ర్యాక్‌లతో బయల్దేరిన గూడ్స్ రైలులో 11మెట్రిక్ టన్నుల ఎరువుల్ని గజ్వేల్‌కు తరలిస్తున్నారు. ఇందుకోసం గజ్వేల్ రైల్వేస్టేషన్‌లో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గజ్వేల్ ప్రాంత అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైల్వే ప్రాజెక్టుల్ని కేంద్ర భాగస్వామ్యంతో చేపట్టారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల మేర రూ.1160.47కోట్ల రుపాయల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.
నాలుగు భాగాల్లో చేపట్టిన ప్రాజెక్టులో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు 43 కిలోమీటర్ల పొడవున పూర్తి చేశారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆ మార్గంలో అన్ని పరీక్షలు నిర్వహించి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రైళ్ల రాకపోకలకు సిద్ధంగా ఉందని నిర్ధారించారు.
గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఇప్పటికే ఎరువుల దిగుమతి కోసం ర్యాక్ పాయింట్ ఉంది. ఎరువుల్ని నిల్వ ఉంచేందుకు 4వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో రెండు గోడౌన్లను అద్దె పద్ధతిలో నిర్మించారు. సనత్‌నగర్, చర్లపల్లి నుంచి గజ్వేల్ రైల్వే మార్గాన్ని అనుసంధానించనున్నారు. మనోహరాబాద్ కొత్తపల్లి మార్గాన్ని ఎఫ్‌సిఐ గోడౌన్ల వరకు విస్తరిస్తారు. రైలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో జిల్లాలో మరిన్ని ప్రభుత్వ, ప్రైవేట్ గోడౌన్లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.
టాపిక్