ప్యాసింజర్ రైల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైన ఘటన బీబీ నగర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. మిర్యాలగూడ నుంచి కాచిగూడకు వెళుతున్న పుష్ పుల్ ట్రైన్ అడుగు భాగంలో మంటలు చెలరేగాయి. రైలు కింద భాగంలో మంటల్ని గుర్తించిన ప్రయాణికులు బీబీ నగర్ రైల్వే స్టేషన్‌లో రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు.
రైలు దిగువన మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేశారు. రైలు కింద భాగంలో చెలరేగిన మంటల్ని సిబ్బంది ఆర్పివేశారు. ఈ ప్రమాదంతో రైల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దానిని నిలిపివేశారు. దాదాపు గంటన్నరకు పైగా బీబీ నగర్ రైల్వే స్టేషన్‌లోనే రైలు నిలిచిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
హైదరాబాద్ అఫ‌్ఝల్ గంజ్ ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. భవనం కింద భాగంలో పేపర్ ప్లేట్స్ తయారు చేసే కర్మాగారం ఉండగా పై భాగంలో భవన యాజమానితో పాటు మరికొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భవనం కింద భాగంలో చెలరేగిన మంటలు భవనం మొత్తాన్ని ఆక్రమించాయి.
అగ్ని ప్రమాదంతో భవనం పై భాగంలో నివాసం ఉంటున్న వారు అందులోనే చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న చిన్నారులతో పాటు ఎనిమిది మందిని సురక్షితంగా రక్షించారు. ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా కాలి బూడిదైంది. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది.
సంబంధిత కథనం