TG Welfare Schemes : ప్రజల ఖాతాల్లోకి డబ్బులే డబ్బులు.. నిధులను సిద్ధం చేసిన ఆర్థిక శాఖ!-finance department has prepared funds for the implementation of welfare schemes in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Welfare Schemes : ప్రజల ఖాతాల్లోకి డబ్బులే డబ్బులు.. నిధులను సిద్ధం చేసిన ఆర్థిక శాఖ!

TG Welfare Schemes : ప్రజల ఖాతాల్లోకి డబ్బులే డబ్బులు.. నిధులను సిద్ధం చేసిన ఆర్థిక శాఖ!

Basani Shiva Kumar HT Telugu
Jan 24, 2025 10:59 AM IST

TG Welfare Schemes : జనవరి 26న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాలకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చెల్లింపులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటు చివరి త్రైమాసికం రుణాలకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతి వస్తుందని భావిస్తున్నారు.

పథకాల అమలుకు నిధులు సిద్ధం
పథకాల అమలుకు నిధులు సిద్ధం

గణతంత్ర దినోత్సవం రోజున తెలంగాణలో పండగ వాతావరణం నెలకొననుంది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయనుంది. ఈ పథకాలకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీని కూడా ప్రభుత్వం జనవరి 26న ప్రారంభించనుంది.

yearly horoscope entry point

పెట్టుబడి సాయం..

రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు రైతులకు పెట్టుబడి సాయం చేయనున్నారు. ఒక పంటకు సంబంధించి రూ.6 వేలు మొదటగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నారు. వీటిని కూడా రైతు భరోసా తరహాలోనే ఏడాదికి రెండుసార్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడత కింద తొలుత రూ.6 వేలు ఖాతాల్లో జమ చేయనున్నారు.

రూ.10 వేల కోట్లు అవసరం..

కేవలం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకే తక్షణం రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయని ఆర్థిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేసేందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ అవసరమైన నిధులను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం, వివిధ మార్గాల ద్వారా సేకరించిన రుణాలను ఈ పథకాల అమలు కోసం వినియోగించనున్నారు.

సిద్ధంగా నిధులు..

జనవరి నెలలో ఇప్పటికే ప్రభుత్వం రూ.3 వేల కోట్లు అప్పుగా సమీకరించుకుంది. మరోవైపు టీజీఐఐసీ భూములు తనఖాపెట్టి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు రుణం తీసుకుంది. ఈ నిధులు కూడా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం అనుకున్న అన్ని పథకాలకు చెల్లింపుల ప్రక్రియ సాఫీగా సాగనుంది. రైతు భరోసా పథకానికి సంబంధించి మొదట తక్కువ విస్తీర్ణం ఉన్నవారికి, ఆ తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో భూములు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

మరిన్ని రుణాలు..

ఇతర పథకాల అమలు, జీతాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. అయితే.. చివరి త్రైమాసికంలో తీసుకోవాల్సిన రుణాలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. చివరి త్రైమాసికం రుణాలకు సంబంధించి కేంద్రం నుంచి వారంలో అనుమతి వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితికి లోబడి రూ.52 వేల కోట్ల వరకు రుణాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే.. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.43 వేల కోట్లకు పైగా ప్రభుత్వం రుణాలు తీసుకుంది. త్వరలో మరో రూ.10 వేల కోట్ల వరకు రుణాలు తీసుకునే అవకాశం ఉంది.

Whats_app_banner