TG MLC Elections 2025 : త్వరలో ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు...! పట్టభద్రులు, టీచర్ ఓటర్ల జాబితా విడుదల, లెక్కలివే
Telangana MLC Elections 2025 : ఉత్తర తెలంగాణలో త్వరలో గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు (నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్) జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితాలను అధికారులు విడుదల చేశారు. పట్టభద్రుల ఓటర్లు 3,41,313గా, టీచర్లు 25,921 ఓటర్లుగా ఉన్నారు.
త్వరలో జరగనున్న ఉత్తర తెలంగాణలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఓటర్లు 3,41,313 మంది, థర్డ్ జెండర్లు ముగ్గురు ఉండగా ఉపాధ్యాయ ఓటర్లు 25,921 మంది ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తున్న క్రమంలో ఇప్పటికే రెండు సార్లు ఓటర్ నమోదుకు అవకాశమిచ్చింది. తుది జాబితాను ప్రకటించి ఇదే జాబితాతో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటర్ల సంఖ్య క్రమంలో పట్టభద్రులకు సంబంధించి 499 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఓటర్లకు 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
కరీంనగర్ లోనే అత్యధికంగా ఓటర్లు....
ఓటరు నమోదులో కరీంనగర్ టాప్ లో నిలిచింది. పట్టభద్రులు, టీచర్ ఓటరు నమోదులో రెండింటిలో కరీoనగర్ జిల్లా వారే ఎక్కువ మంది ఉన్నారు. పట్టభధ్రుల, టీచర్ల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 15 జిల్లాలుండగా పట్టభద్రుల ఓటరు నమోదులో కరీంనగర్ జిల్లాలో 69,657 మంది అత్యధిక సంఖ్యలో ఓటరుగా నమోదు కాగా అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేవలం 2,420 మంది మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవడం విశేషం.
ఉపాధ్యాయ ఓటరు నమోదులో 4,020 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 81మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలు కరీంనగర్ తరువాత స్థానాల్లో నిలువగా ఇతర జిల్లాలో నమోదు అంతంతమాత్రమే. సాధారణ ఓటరు జాబితాలో మహిళల ఆధిక్యం ఉండగా ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పురుష సంఖ్యకు సగానికి ఉండటం గమనార్హం.
పెరిగిన ఓటర్లు....
ఈ ఏడాది సెప్టెంబరు 30న ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమై నవంబరు 6వ తేదీ వరకు కొనసాగింది. దీంతో పట్టభద్రులు 3,58,579 మంది ఓటును నమోదు చేసుకోగా, ఉపాధ్యాయులు 27,994 మంది ఓటును పొందడానికి ఉత్సాహాన్ని చూపించారు. తిరిగి నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు కొత్తగా నమోదుతో పాటు అభ్యంతరాలకు సమయం ఇవ్వడంతో కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి పలువురు ముందుకొచ్చారు.
పక్షం రోజుల వ్యవధిలో పట్టభద్రులవి 28,111 ధరఖాస్తులు కొత్తగా చేరగా.. ఉపాధ్యాయుల పరంగా అదనంగా 5,054 మంది ఆసక్తిని చూపించారు. దీంతో మొత్తంగా పట్టభద్రుల ఓటర్ల దరఖాస్తుల సంఖ్య 3,86,690కి చేరింది. ఉపాధ్యాయ ఓటర్ల దరఖాస్తుల సంఖ్య 33,048కి పెరిగింది. మలి విడతలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 10 నుంచి పరిశీలించగా చాలా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. పక్కాగా ఉన్న వాటిని మాత్రమే ఆమోదం తెలిపి తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. ఇంకా ఎవరైనా నమోదు చేసుకునేవారుంటే షెడ్యూల్ వెలువడ్డాక నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యేవరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించనున్నది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని బిఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ గా పోటీ చేసేందుకు సిద్దమైన సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. ఒక్కరి పేరు రెండు మూడు చోట్ల నమోదు అయిందని, అత్యధికంగా 8 చోట్ల ఓటర్ జాబితాలో ఉందన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు విడుదల చేశారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆధార్ ఆధారంగా పట్టభద్రుల ఓటర్ల జాబితా తయారు చేయాలని డిమాండ్ చేశారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం