Street Fight: రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు నడిరోడ్డు వేదికగా మారింది. పరస్పర దాడులతో నడిరోడ్డుపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నడి రోడ్డుపై రెండు కుటుంబాలు కొట్లాడుకుంటుండగా, గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాాబాద్ జిల్లా జీకే తండాకు చెందిన భద్రమ్మ, అదే తండాకు చెందిన రమేశ్ కుటుంబాల మధ్య కొద్ది రోజులుగా బాట పంచాయితీ నడుస్తోంది. ఆ బాట తమదంటే తమదనే గొడవలు జరుగుతుండగా.. కొంతకాలంగా ఇరు కుటుంబాల పంచాయితీ పెద్ద మనుషుల దాకా వెళ్లింది.
దీంతో గ్రామ పెద్దలు పలుమార్లు పంచాయితీ నిర్వహించి, ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఇరు వర్గాల మధ్య రాజీ కుదరక, తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య బాట పంచాయితీ నడుస్తుండగా.. మంగళవారం మరోసారి గొడవ జరిగింది. దీంతో ఇరు వర్గాలు మంగళవారం మధ్యాహ్నం సమయంలో పెద్ద మనుషుల్లో మట్లాడుకున్న అనంతరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఇంటికి చేరుకున్న భద్రమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ పండుగ చేసుకుంటోంది.
ఇంతలో అక్కడికి వచ్చిన రమేశ్ కుటుంబ సభ్యులు భద్రమ్మ ఇంటికి వెళ్లి మళ్లీ గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య మాటామాట పెరగగా.. రమేశ్ కుటుంబ సభ్యులు భద్రమ్మపై గొడ్డలితో దాడి దిగారు. దీంతో ఆమెకు గాయాలు కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను అప్పటికప్పుడు తొర్రూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.
భద్రమ్మ తొర్రూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా, ఇంతలోనే రమేశ్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆసుపత్రి నుంచి మంగళవారం రాత్రి భద్రమ్మ తన కుటుంబ సభ్యులతో బయటకు వస్తుండగా.. మరోసారి ఆమె కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.
తొర్రూరు ఆసుపత్రి ఎదుట ఉన్న మెయిన్ రోడ్డుపై రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. సినిమాల్లో స్ట్రీట్ ఫైట్ ను తలపించేలా ఇరు వర్గాలు దాడి చేసుకుంటుండటంతో అక్కడంతా భయానక వాతావరణం నెలకొంది. నడి రోడ్డుపై గొడవ జరుగుతుండటంతో కొందరు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ తరువాత చాలా సేపు ఇరు వర్గాల నడుమ గొడవ జరగగా.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలసుకున్న వెంటనే తొర్రూరు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వివరాలు సేకరించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు. ఇదిలాఉంటే ఈ ఘటన అంతటినీ రోడ్డుపై ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ గా మారింది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం