BRS Warangal : సిట్టింగ్​లు వర్సెస్ ఆశావహులు - టికెట్ల కోసం ఉమ్మడి వరంగల్ BRSలో వర్గపోరు!-fight between brs aspirants sitting mlas for party tickets in united warangal district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Warangal : సిట్టింగ్​లు వర్సెస్ ఆశావహులు - టికెట్ల కోసం ఉమ్మడి వరంగల్ Brsలో వర్గపోరు!

BRS Warangal : సిట్టింగ్​లు వర్సెస్ ఆశావహులు - టికెట్ల కోసం ఉమ్మడి వరంగల్ BRSలో వర్గపోరు!

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 13, 2023 10:52 AM IST

TS Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెట్టేలా పావులు కదుపుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు BRS నేతలు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. ఫలితంగా అసమ్మతి సెగలు ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వేడెక్కుతున్న వరంగల్ బీఆర్ఎస్ రాజకీయాలు
వేడెక్కుతున్న వరంగల్ బీఆర్ఎస్ రాజకీయాలు

Telangana Assembly Elections 2023: మరికొద్ది రోజుల్లో తెలంగాలో ఎన్నికల యుద్ధం షురూ కాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. రేసు గుర్రాలపై ఫోకస్ పెడుతున్న ఆయా పార్టీల అధినాయకత్వాలు... టికెట్లు ఆశించి భంగపడే నేతలను తమ సైడ్ తిప్పుకోవాలని చూస్తున్నాయి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు నెమ్మదిగా తెరపైకి వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెట్టాలా టికెట్ ఆశిస్తున్న నేతలు అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని... అలా జరగకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేల విజయావకాశాలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ వర్గపోరు.. ఎవరికి లాభం చేకూరుస్తుందనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతర్గత కుమ్ములాటలతో అధికార పార్టీ బీఆర్ఎస్ లో రాజకీయం తెగ హీటెక్కుతోంది. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా.. అన్నిచోట్ల వర్గపోరు రచ్చకెక్కింది. ఇరు వర్గాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సిట్టింగ్ లు,ఆశావహులు టిక్కెట్ల వేట మొదలుపెట్టారు. ఈ సారి ఎలాగైనా టిక్కెట్ దక్కించుకోవాలని ద్వితీయ శ్రేణి నాయకులు, ఉద్యమకారులు ప్రయత్నిస్తున్నారు. అయితే నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిద్దిదామని తమకే అధినేత పార్టీ బీ ఫాం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు పార్టీ, ఎమ్మెల్యే కోసం పనిచేసినా.. తమకు సరైన స్థానం కల్పించలేదని ద్వితీయ శ్రేణి నాయకులు, ఉద్యమకారులు గరం గరం అవుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. అయినా అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతిగళం కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నియోజకవర్గాల వారీగా చూస్తే.....

పాలకుర్తిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి గెలవాలని చూస్తున్నారు. అయితే ఎర్రబెల్లికి కూడా అసమ్మతి మంటలు అంటుకున్న సీన్లు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ముగ్గురు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరే యోచనలో ఉన్నట్టు తెలిస్తోంది. వీరు ముగ్గురు కూడా దయాకర్ రావుకు అత్యంత సన్నిహితులు కావడం విశేషం. అయితే వీరితో మంత్రి ఎర్రబెల్లి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. పార్టీని వీడకండా బుజ్జగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే విషయంపై సదరు నేతలు స్పందిస్తూ పార్టీ కోసం పని చేస్తామంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేయటం కొసమెరుపుగా మారింది. అయితే ఎర్రబెల్లి బుజ్జింగుపులతో దారిలోకి వచ్చారా..? లేక చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇక వర్ధన్నపేట బీఆర్ఎస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది.ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పై సొంత పార్టీ నేతలే తిరుగుబావూటా ఎగురవేశారు. అసమ్మతి నేతలంతా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు నేతృత్వంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి ఈ సారి వర్ధన్నపేట నుంచి ఆరూరిని తప్పించాలని కోరారు. దీంతో దయాకర్ రావు అసంతృప్త నేతలను బుజ్జగించినట్లు తెలిసింది. పార్టీ అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వారికి నచ్చచెప్పినట్లు సమాచారం. మరోవైపు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇప్పటికే భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు సొంత పార్టీ నేతలతోపాటు కూతురి నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల ఓ భూమి విషయంలో ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి ఆయనపై కేసు పెట్టడం చర్చానీయాంశంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా, పాలకుర్తిలో మంత్రి దయాకర్ రావుకు వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఆయన కూడా జనగామపై దృష్టిసారించినట్లు ప్రచారం జరుగుతోంది.

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్ నేతలు కయ్యానికి కాలు దువ్వుకుంటున్నారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధిష్ఠానం ఆశీస్సులు నా కంటే నాకే ఉన్నాయని ఒకరికొకరు కార్యకర్తల వద్ద చెప్పుకుంటున్నారు.వీరివురి వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పిలిచి మాట్లాడారు. అయినా వారి మధ్య అదే స్థాయిలో వైరం కొనసాగుతున్నది.ఈ ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు ఢీ అంటే ఢీ అంటూ ఎవరికి వారిగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇక డోర్నకల్ లో చూస్తే ఇది ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రెడ్యా నాయక్ ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు. 2018లో బీఆర్ఎస్ బీ ఫాం అందుకొని.. విజయం సాధించారు. అప్పటి నుంచి తిరుగులేని నేతగా ఉన్న రెడ్యాకు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతిబంధకంగా మారారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సత్యవతి రాథోడ్ ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం ఆమె డోర్నకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. వీరిద్దరు తమ అనుచరులతో టిక్కెట్ తమకే వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

మహుబూబాబాద్ ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ కొనసాగుతున్నారు. ఇటీవల ఈ నియోజకవర్గంలో వర్గవిభేదాలు రచ్చకెక్కాయి. ఈ సారి ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ వద్దంటూ బీఆర్ఎస్ నేతలు మానుకోటలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీని వెనుక ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఉన్నారని శంకర్ నాయక్ భావిస్తున్నారు. 2014లో శంకర్ నాయక్ కు టిక్కెట్ రావడంలో రవీందర్ కృషి ఉంది. తర్వాత వీరి మధ్య సంబంధాలు కట్ అయ్యాయి.తనకు ఈ సారి టిక్కెట్ రాకుండా ఎమ్మెల్సీ అడ్డుకుంటున్నాడని శంకర్ నాయక్ తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా... ఇదే నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ మాలోతు కవిత బరిలో దిగేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ కూడా డోర్నకల్ సీటు దక్కపోతే అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సై అంటున్నారు. ఫలితంగా మానుకోటలో రాజకీయ మంటలు కాకరేపుతున్నాయి.

వరంగల్ తూర్పులో నన్నపనేని నరేందర్ కు సొంత పార్టీ నుంచి పోటీ ఉంది. ఏ నియోజకవర్గంలో లేనివిధంగా ఇక్కడి నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యే స్థాయి నేతలు ఉన్నారు. తూర్పు టిక్కెట్ కోసం ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాగా, కొందరు నేతలు తిరుగుబావూట ఎగుర వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. వారి వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయి. ప్రస్తుం నివురుగప్పిన నిప్పులా ఉంది. బస్వరాజు సారయ్యతో పాటు చాలా మంది నేతలు ఇక్కడి టికెట్ ను ఆశిస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ లో లుకలుకలు కొనసాగుతున్నాయి. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి,కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కారెక్కారు. దీంతో గులాబీ పార్టీలో ఇటు మధుసూదనాచారి, అటు వెంకటరమణారెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి టిక్కెట్ తనకంటే తనకు అని ఇద్దరు ప్రచారం చేసుకుంటున్నారు. ఇరువురు పోటాపోటీగా నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు.

పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి ఉన్నప్పటికీ అనుభవం కలిగిన చల్లా అన్ని సరిదిద్దినట్లు తెలిసింది. ఇదే టికెట్ ను నాగుర్ల వెంకన్న ఆశిస్తున్నారు.నియోజకవర్గంలో పర్యటిస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు ఇంటి పోరు తప్పేలా లేదు. ఆయన సోదరుడు మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ కుమారుడు కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ నుంచి పోటీ ఎదురయ్యేలా ఉంది. ప్రణయ్ కి ప్రజల్లో మంచి పేరు ఉండటం.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వినయ్ పై కొంత వ్యతిరేకత ఉండటం తనకు కలిసి వస్తాయని అభినవ్ భాస్కర్ భావిస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రగా కూడా పోటీ చేస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏకైక సీటు ములుగు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ్నుంచి గెలవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న సీతక్కను ఢీకొట్టే స్థాయి నేతలు లేకపోవటం ఇబ్బందికరంగా మారింది. మాజీ ఎంపీ సీతారాం నాయక్ ములుగు నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ మేరకు ఇదే విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మాజీ మంత్రి, దివంగతనేత చందూలాల్ కూమారుడు ప్రహ్లాద్ సైతం ఈ సారి బరిలో దిగాలని తహతహలాడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. వీరే కాకుండా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బడే.నాగజ్యోతి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఇక నర్సంపేట బీఆర్ఎస్ లో ఆసక్తికర పరిస్థితి కనిపిస్తోంది. అంతర్గత కుమ్ములాటలున్నప్పటికీ ఇప్పటి వరకు బాహటం కాలేదు. అయితే... బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న తాను సైతం ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఊవ్విళ్లూరుతున్నారు. మొన్నటి వరకు నర్సంపేట టిక్కెట్ కావాలని పట్టుబట్టిన ఆమె.. తాజాగా వరంగల్ ఎంపీ స్థానంపై కన్నేసినట్లు తెలిసింది. వరంగల్ ఎంపీ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడం.. ఆమె కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పార్లమెంట్ సీటుపై గురిపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం