BRS to Congress : ఆగని 'ఆపరేషన్ ఆకర్ష్' - ఈసారి రేవంత్ భారీ స్కెచ్, లిస్ట్ పెద్దదే..!-few more brs mlas are likely to join congress soon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs To Congress : ఆగని 'ఆపరేషన్ ఆకర్ష్' - ఈసారి రేవంత్ భారీ స్కెచ్, లిస్ట్ పెద్దదే..!

BRS to Congress : ఆగని 'ఆపరేషన్ ఆకర్ష్' - ఈసారి రేవంత్ భారీ స్కెచ్, లిస్ట్ పెద్దదే..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 21, 2024 04:56 PM IST

Telangana Politics : పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో డీలా పడిపోవటంతో… ఆపరేషన్ ఆకర్ష్ కు మరోసారి కాంగ్రెస్ పదునుపెట్టేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి రప్పించింది. ఇదే బాటలో మరికొందరు ఉన్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు....!
కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు....!

BRS to Congress : తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత….సమీకరణాలు మారిపోయాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాలను గెలవగా… బీఆర్ఎస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది.

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో చాలా సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డైలామాలో పడిపోయారు. ఇక ఇదే అదునుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ…. స్పీడ్ పెంచే పనిలో పడింది. మొన్నటి వరకు ఓ లెక్క… ఇక నుంచి మరో లెక్క అన్నట్లు ముందుకెళ్లే పనిలో పడింది.

కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్….

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. కీలక నేతలపై నజర్ పెట్టింది. అవకాశం ఉన్న ప్రతిచోట చేరికలను ప్రోత్సహిస్తూ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నాటికే కీలక తంతును పూర్తి చేయాలని భావించినప్పటికీ…. కుదరలేదు. అప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుంది. తెల్ల వెంకట్రావ్, దానం నాగేందర్ ను ముందుగానే చేర్చుకోగా… పార్లమెంట్ ఎన్నికల వేళ కడియం శ్రీహరిని తీసుకునే గట్టి షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత… మళ్లీ  కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు సిద్ధమైంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా పలు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని పలువురు ఎమ్మెల్యేలు ఖండించకపోవటంతో…. పార్టీ మారటం ఖాయమనే భావన గులాబీ శ్రేణుల్లో కూడా ఉంది.

ఈ నేపథ్యంలోనే…. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంది. స్వయంగా రేవంత్ రెడ్డినే ఆయన ఇంటికి వెళ్లి పోచారాన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉంది. ఇక ఇదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు కూడా కాంగ్రెస్ గాలం వేసినట్లు సమాచారం. 

గ్రేటర్ పై ప్రత్యేక గురి….!

ఇక గ్రేటర్ పై కాంగ్రెస్ ప్రత్యేక గురి పెట్టింది. ఇక్కడ్నుంచి ఆ పార్టీ తరపున ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. ఇటీవలే జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచి ఖాతా తెరిచింది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం పార్టీలో చేరారు. ప్రస్తుతం గ్రేటర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరిలో మెజార్టీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ నుంచే ఐదు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలను లైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారితో తెరవెనక సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేతో పాటు మెదక్ నుంచి ఇద్దరి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ వ్యూహాం పన్నుతుందని తెలుస్తోంది. అతి కొద్దిరోజుల్లోనే దాదాపు  పది నుంచి 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కండువా కప్పేయాలని చూస్తున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా… ఎమ్మెల్సీలపై కూడా కాంగ్రెస్ నజర్ పెట్టింది. మండలిలో బీఆర్ఎస్ కు బలం ఉండటంతో… పలువురు ఎమ్మెల్సీలను పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చేరికలు కూడా త్వరలోనే ఉండే అవకాశం ఉంది. తాజాగా పోచారంతో మొదలైన చేరికలు… ఎక్కడితో ఆగుతాయనేది ఆసక్తికరంగా మారింది….!

WhatsApp channel