Kamareddy Suicides: కామారెడ్డిలో కలకలం.. చెరువులో శవమై కనిపించిన మహిళా కానిస్టేబుల్, ఎస్సై..-female constable commits suicide in kamareddy body of another youth found ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kamareddy Suicides: కామారెడ్డిలో కలకలం.. చెరువులో శవమై కనిపించిన మహిళా కానిస్టేబుల్, ఎస్సై..

Kamareddy Suicides: కామారెడ్డిలో కలకలం.. చెరువులో శవమై కనిపించిన మహిళా కానిస్టేబుల్, ఎస్సై..

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 26, 2024 08:54 AM IST

Kamareddy Suicides: కామారెడ్డిలో మహిళా కానిస్టేబుల్‌ అదృశ్యం, చివరకు ఊరి చెరువులో శవమై కనిపించడం, అక్కడే మరో యువకుడి శవం లభించడంతో గందరగోళం నెలకొంది. కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశంలో ఎస్సై కారు ఉండటంతో గాలించగా మృతదేహం బయటపడింది.

కామారెడ్డిలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. చెరువులో జంట శవాలు
కామారెడ్డిలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. చెరువులో జంట శవాలు

Kamareddy Suicides: కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో జంట శవాలు కలకలం సృష్టించింది. మృతి చెందిన వారిలో మహిళా కానిస్టేబుల్ ఉండటం, అదే ప్రాంతంలో ఎస్సై కారు నిలిపి ఉంచడం, ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావడం మరింత సంచలనంగా మారింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు పీఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్న సాయికుమార్‌ బుధవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. తెల్లవార్లు గాలింపు జరిపిన తర్వాత గురువారం ఉదయం ఎస్సై సాయి కుమార్ మృతదేహం లభించింది. ఈ శవాల మిస్టరీ వీడాల్సి ఉంది. 

yearly horoscope entry point

బీబీపేట పోలీస్‌ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌‌గా పనిచేస్తున్న శృతి బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. బుధవారం డ్యూటీ ముగిసిన తర్వాత రాత్రి అయినా శృతి ఇంటికి రాకపోవడంతో.. ఆమె తల్లి తాడ్వాయిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శృతి స్నేహితురాలికి ఫోన్‌ చేశారు. తన కుమార్తె ఇంకా ఇంటికి రాలేదని, ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వస్తుందని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత శృతి స్నేహితురాలు పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఆమె సూచనతో శృతి తల్లి పోలీసు అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు శృతి ఫోన్‌ లోకేషన్‌ ట్రేస్‌ చేశారు. 44వ జాతీయ రహదారి వెంబడి ఉన్న అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద ఫోన్‌ సిగ్నల్స్‌ ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు అక్కడి వెళ్లి పరిశీలించడంతో శృతి ఫోన్‌తో పాటు భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌ కారు, చెప్పులు.. బీబీపేట గ్రామానికి చెందిన నిఖిల్‌ అనే వ్యక్తి చెప్పులు, ఫోన్‌ కూడా చెరువు ఒడ్డున కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు సాయికుమార్‌కు ఫోన్‌ చేయగా.. స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది.

బీబీపేట గ్రామానికి చెందిన శృతి, నిఖిల్ అదృశ్యం కావడం ఎస్సై సాయికుమార్‌ కారు అక్కడే ఉండటం పలు అనుమానాలకు దారి తీసింది. ముగ్గురి మధ్య ఏదైనా ఘర్షణ జరిగిందా అనే కోణంలోపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో గాలింపు చేపట్టగా శృతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. అదే చెరువు వద్ద ఎస్సైకి చెందిన కారు, చెప్పులు లభ్యం కావడంతో ఆయన కూడా చెరువులో దూకి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో గాలింపు కొనసాగిస్తున్నారు.

కానిస్టేబుల్ శవం లభ్యమైన వెంటనే పోలీసులు వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించగా.. ఎస్పీ సింధు శర్మ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. చీకట్లోనే చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్‌ శృతి, నిఖిల్‌ మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఎస్సై సాయికుమార్‌ ఆచూకీ లభించలేదు. ముగ్గురు చెరువు దగ్గరకు వీరు ఎందుకు వెళ్లారనేది మిస్టరీగా మారింది. శృతి ఆత్మహత్య చేసుకోవడంతో కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయి ఉంటారా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్సైతో గతంలో పరిచయం.. పెళ్లి విషయంలో వివాదం

కానిస్టేబుల్‌ శృతితో ఎస్సై సాయికుమార్‌కు గతంలో పరిచయం ఉంది. సాయి కుమార్‌ రెండేళ్ల క్రితం బీబీపేట ఎస్సైగా పని చేశారు. ఆ సమయంలో శృతి అక్కడే పని చేశారు. ఆమెకు అప్పటికే వివాహమైనా .. భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో సాయికుమార్‌, శృతి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందనే అనుమానాలు ఉన్నాయి.

వీరిద్దరి మధ్య బీబీపేట సింగిల్‌ విండో సొసైటీలో ఆపరేటర్‌గా పని చేస్తున్న నిఖిల్‌ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత సాయికుమార్‌ భిక్కనూరుకు బదిలీ కావడంతో శృతితో దూరం పెరిగిందని, ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలిసింది. 

ఈ క్రమంలోనే ఆత్మహత్యలు జరిగి ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఎస్సైను బెదిరించే క్రమంలో చెరువులో దూకడం, ఆమెను రక్షించే క్రమంలో మిగిలిన వాళ్లు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని, దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. గురువారం ఉదయం  చెరువులో బిక్కనూరు ఎస్సై సాయికుమార్ మృతదేహాన్ని రెస్క్యూ  బృందాలు వెలికి తీశాయి. 

Whats_app_banner