Warangal Tiger : వరంగల్ జిల్లాలో పులుల సంచారం.. ఈ ప్రాంతాల వారికి అలర్ట్.. ఒంటరిగా తిరగొద్దు!
Warangal Tiger : ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులుల సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రైతులు పొలాల వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారు. పులుల సంచారంతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, అడవుల్లోకి వెళ్లవద్దని సూచించారు.
ఇటీవల ములుగు జిల్లాలో సంచరించిన పులు.. తాజాగా.. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శుక్రవారం నాడు (డిసెంబర్ 27న) వరంగల్ జిల్లా నల్లబెల్లి, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలాల్లో పులుల పాదముద్రలు గుర్తించారు. రెండు మగ పులులు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ప్రకటించారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఒంటరిగా తిరగొద్దు..
పులులు సంచరిస్తున్న నేపథ్యంలో.. ప్రజలు ఒంటరిగా తిరగవద్దని, రాత్రి వేళలో పంట పొలాల వైపు వెళ్లవద్దని అటవీ అధికారులు సూచించారు. పులుల విషయాన్ని గ్రామాల్లోని ప్రజలకు తెలిసేలా చాటింపు వేయించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రాంపూర్, కోనాపురం, ఓటాయి, కర్ణగండి అడవుల్లోకి మేకల, పశువుల కాపరులు వెళ్లవద్దని ఫారెస్ట్ ఆఫీసర్లు హెచ్చరించారు.
ములుగు జిల్లా నుంచి..
మహబూబాబాద్, వరంగల్, ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవులకు.. నల్లబెల్లి మండలం కొండాపురం అటవీ ప్రాంతాన్ని గేట్‌వేగా ఫారెస్ట్ అధికారులు పరిగణిస్తారు. ఇటీవల ములుగు జిల్లా తాడ్వాయి, మంగపేట ప్రాంతంలో సంచరించిన పులి.. కొండాపురం అడవుల్లోకి ప్రవేశించినట్టు అధికారులు చెబుతున్నారు.
మగ పులి పాదముద్రలు..
పులి సంచరించిన ఆనవాళ్లపై కొండాపూర్ ప్రాంతంలో గాలింపు చేపట్టామని.. ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. కొండాపురం శివారులోని పంట చేనులో పెద్దపులి మలం కనిపించిందని చెప్పారు. పులి మలం కనిపించడం చాలా అరుదు అని అధికారులు వివరిస్తున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం అటవీ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో.. మరో పులి పాదముద్రలను గుర్తించినట్టు తెలుస్తోంది. పాదముద్రల ఆధారంగా అది మగ పులిగా ప్రకటించారు.
అప్రమత్తంగా ఉండాలి..
ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు సర్వాపురం, రాయినిగూడెం, అంకన్నగూడెం, కొత్తూరు గ్రామాల సమీప అడవిలో పెద్దపులి సంచరించే అవకాశముందని.. అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పశువుల కాపరులు, ప్రజలు అడవుల్లోకి వెళ్లొద్దని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.