Dil Raju On KTR : రాజకీయ ప్రతిదాడులకు చిత్ర పరిశ్రమను వాడుకోవద్దు- కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన దిల్ రాజు
Dil Raju On KTR : రాజకీయ దాడి, ప్రతిదాడులకు చిత్ర పరిశ్రమను వాడుకోవద్దని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు కోరారు. సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు.
Dil Raju On KTR : మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుగా జరిగిన వ్యవహారం కాదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగులపై స్నేహపూర్వకంగా సమావేశం జరిగిందన్నారు. ఎలాంటి దాపరికరాలు లేకుండా జరిగిన సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా తగిన సహకారం అందించాలని సీఎం కోరారు
"హైదరాబాద్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలన్నది సీఎం సంకల్పం. సీఎం సంకల్పానికి పరిశ్రమ ప్రతినిధులుగా మేమంతా స్వాగతించాం. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగొద్దు. పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు పరిశ్రమను వాడుకోవద్దు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న చిత్ర పరిశ్రమకు ప్రభుత్వాల సహకారం అవసరం. ప్రజలందరి ప్రోత్సాహం పరిశ్రమకు ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం"- దిల్ రాజు, ఎఫ్డీసీ ఛైర్మన్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు బాధ్యులపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ సినీ ప్రముఖులు పరామర్శించారు. బాధితులను ఎవరూ పరామర్శించలేదన్న విమర్శలు వచ్చాయి. సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించారు. అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై రాష్ట్రంలోని బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంపు ఉండదని స్పష్టం చేశారు. దీంతో చిత్ర పరిశ్రమపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ మొదలైంది. దీంతో సినీ పరిశ్రమ తరఫున పలువురు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి అరెస్టు చేశారని కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపణలు చేశాయి. కేటీఆర్ ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. దీంతో సినీ ప్రముఖుల సీఎంతో భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అల్లు అర్జున్ అంశాన్ని తెరమీదకు తెచ్చారన్నారు. ఆ తర్వాత సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకుని, ఆ అంశంపై ఏం మాట్లాడడంలేదన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై దిల్ రాజ్ స్పందించారు.
సంబంధిత కథనం