Mulugu District : పసిబిడ్డను అమ్మేసిన తండ్రి, 2 నెలల తర్వాత పోలీసులను ఆశ్రయించిన తల్లి..! 'ఊయల' సినిమాను తలపించే సీన్
Mulugu District Crime News: పుట్టిన ఆడబిడ్డను తండ్రి కొనుగోలు చేశాడు. పైగా భార్యకు చనిపోయిందని అబద్ధం చెప్పాడు. రెండు నెలల తరువాత భార్య పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం బయటికి వచ్చింది.
Mulugu District Crime News : ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. మళ్లీ కూతురే పుట్టిందని ఓ తండ్రి మూర్ఖంగా ఆలోచించాడు. పుట్టిన ఆడ శిశువును రూ.15 వేల నగదు, పాత టీవీఎస్ ఎక్స్ఎల్ బండి తీసుకుని అమ్మేశాడు. అనంతరం అనారోగ్యంతో బిడ్డ చనిపోయిందని భార్యను నమ్మించి ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. ఇటీవల భార్యకు అనుమానం వచ్చి భర్తను నిలదీయడంతో అసలు విషయం బయట పడింది. దీంతో ఆ తల్లి….. తన బిడ్డ కోసం ఏటూరు నాగారం పోలీసులను ఆశ్రయించింది.
స్థానికులు తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేలు గ్రామానికి చెందిన లక్ష్మీ, జంపయ్య భార్యాభర్తలు. వారికి ఇదివరకే ఇద్దరు కూతుళ్లు పుట్టగా, మూడో సంతానంలో కుమారుడు పుడతాడని జంపయ్య ఆశ పడ్డాడు. కాగా లక్ష్మీ తొమ్మిది నెలల గర్భిణి కావడంతో ప్రసవం కోసం ఈ ఏడాది జూన్ 1వ తేదీన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ కు తీసుకొచ్చాడు. ఈ మేరకు అదే రోజు డాక్టర్లు డెలివరీ చేయగా, లక్ష్మీ మరో సారి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మూడో కాన్పులో కూడా ఆడ శిశువే జన్మించడంతో జంపయ్య తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు.
చనిపోయిందని నాటకం..!
మూడో కాన్పులోనైనా కొడుకు పుడతాడనుకుంటే మళ్లీ ఆడ శిశువే పుట్టిందంటూ జంపయ్య కుమిలి పోయాడు. ఏం చేయాలో తోచక ఆడ పిల్లను అమ్మేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అదే రోజు ఆసుపత్రిలో కొంత మందికి చెప్పుకుంటూ వచ్చాడు. ఇదివరకే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని, మూడో సారి కూడా బిడ్డనే పుట్టిందని, ఎవరైనా కావాలనుకుంటే వారికి ఇచ్చేస్తానంటూ చెప్పుకుంటూ తిరిగాడు.
దీంతో ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన ఓ దంపతులు జంపయ్యతో మాట్లాడారు. దీంతో తన ఉద్దేశాన్ని జంపయ్య వారికి వివరించగా, ఆ బిడ్డను తమకు ఇవ్వాల్సిందిగా వారు కోరారు. ఈ మేరకు జంపయ్య వారితో బేరం కుదుర్చుకున్నాడు. రూ.15 వేల నగదు, పాత ఎక్స్ఎల్ బండికి ఆశ పడి తమ కూతురును రామన్నగూడెం గ్రామానికి చెందిన దంపతులకు అప్పగించాడు.
ఆ తరువాత తన భార్య పాప ఏదని అడగడంతో.. అనారోగ్యంతో చనిపోయిందని జంపయ్య తన భార్య లక్ష్మిని నమ్మించాడు. ఆ తరువాత లక్ష్మికి సర్దిచెప్పి, సైలెంట్ గా ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు.
‘ఊయల’ సినిమా తరహా సీన్
డెలివరీ అనంతరం లక్ష్మీ, జంపయ్య దంపతులు వారి స్వగ్రామం చర్ల మండలం కలివేలు గ్రామానికి వెళ్లిపోగా, కొద్ది రోజులుగా జంపయ్య ఇష్టారీతిన డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. దీంతో భర్త తీరుపై భార్య లక్ష్మీకి అనుమానం కలిగింది. ఆ డబ్బులు, ఎక్సెల్ బండి ఎక్కడిదని నిలదీసింది. మొదట అవి తనవి కాదని బుకాయిస్తూ వచ్చిన జంపయ్య రెండు రోజుల కిందట కూడా లక్ష్మి నిలదీయడంతో అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు.
దీంతో లక్ష్మీ బోరున విలపిస్తూ తన బిడ్డను తనకు అప్పగించాలని వేడుకుంది. అనంతరం ఏటూరు నాగారం పోలీసులను ఆశ్రయించి, తన బిడ్డను తనకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఇదిలాఉంటే రెండు నెలలుగా తమ సొంత బిడ్డగా పాపను పెంచుకుంటున్న రామన్నగూడెం దంపతులకు విషయం తెలియడంతో వారు కూడా బోరున విలపించారు.
తమ బిడ్డగా పెంచుకుంటున్న పాపను ఇచ్చేది లేదంటూ వాదిస్తున్నారు. దీంతో రెండు కుటుంబాల నడుమ ‘ఊయల’ సినిమా తరహా వాతావరణం నెలకొంది. కాగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందగా, వారు కూడా రంగంలోకి దిగారు. ఇరు కుటుంబాలతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.