Family Suicide: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక గోదావరిలో దూకిన కుటుంబం, తండ్రి, కూతుళ్లు మృతి
Family Suicide: ఆర్థిక ఇబ్బందులు, అప్పులిచ్చిన వారి వేధింపులు తాళలేక బాసరలో ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తండ్రి కూతుళ్లు మృతి చెందగా, స్థానిక మత్స్యకారులు వివాహితను కాపాడారు.
Family Suicide: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాసరలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో తండ్రి కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. మహిళను స్థానిక మత్స్యకారులు కాపాడారు. అప్పులిచ్చిన వారు వాటిని తీర్చాలంటూ ఒత్తిడి చేయడంతో ఓ వ్యక్తి భార్యా కుమార్తెతో కలిసి గోదావరిలో దూకాడు.
నిర్మల్ జిల్లా బాసర వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ పెద్ద గోదావరిలో మునిగి మృతి చెందాడు. ఆయన భార్యను మత్స్యకారులు ప్రాణాలతో కాపాడారు. వారి కుమార్తె గోదావరిలో గల్లంతయ్యింది.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ఉప్పలించి వేణు భార్య అనూరాధ, ఇద్దరు కుమార్తె లతో కలిసి ఇరవై ఏళ్ల కిందట నిజామాబాద్ వలస వచ్చారు. న్యాల్కల్ రహదారి పక్కన కాలనీలో నివసిస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం పాన్‌షాప్ నడుపుతు న్నారు. కొంత కాలంగా ఆ దుకాణం సక్రమంగా నడవక పోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది.
కుటుంబ అవసరాల కోసం స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3 లక్షల వరకు అప్పు తీసుకున్నారు.వాటికి వడ్డీ సక్రమంగానే చెల్లిస్తున్నారు. ఇటీవల అసలు మొత్తం వెంటనే చెల్లించాలంటూ అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేశారు. కొంత గడువు ఇవ్వాలని వేణు కోరినా వినకుండా ఒత్తిడికి గురి చేశారు.
వేణు చిన్నకుమార్తె పూర్ణిమ (25)కు పెళ్లి చూపులు జరిగాయని, అప్పు తీర్చడానికి కొంత సమయం ఇవ్వాలని వారిని వేడుకున్నాడు. అప్పు వెంటనే తీర్చాలని ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన వేణు, భార్య, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై బుధవారం వేకువజామున బాసరకు వచ్చారు. గోదావరి వంతెన పైనుంచి నదిలో దూకారు. వేణు భార్య అనూరాధ నీటి ప్రవాహానికి మొదటి స్నానాల ఘాట్ వైపు కొట్టుకొచ్చారు. నీటిలో కొట్టుకు వస్తున్న మహిళను గమనించిన స్థానిక మత్స్యాకారులు, భక్తులు ఆమెను కాపాడి పోలీసులకు సమా చారం అందించారు.
ముధోల్ సీఐ మల్లేశ్, బాసర, ముధోల్ ఎస్సైలు గణేశ్, సాయికిరణ్ అక్క డికి చేరుకొని అనూరాధతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో గోదావరిలో గాలింపు చేపట్టగా వేణు మృతదేహం లభ్యమైంది. పూర్ణిమ నదిలో గల్లంతు కావడంతో ఆమె కోసం గాలిస్తున్నారు.
అప్పులిచ్చి ఒత్తిడి చేసిన వడ్డీ వ్యాపారుల కోసం బాసర పోలీసులు గాలింపు చేపట్టారు. వేణు పెద్ద కుమార్తెకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. అనారోగ్య కారణాలతో ఆమె కూడా ఆత్మహత్యకు పాల్ప డింది. చిన్న కుమార్తె పూర్ణిమ ఎంబీఏ పూర్తి చేసింది. ఇటీవల ఆమెకు పెళ్లి కుదిరింది. కొద్దిరోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. పెళ్లి జరగాల్సిన ఇంట్లో తండ్రి, కూతుళ్లు బలవన్మరణానికి పాల్పడటం స్థానికుల్ని కలిచి వేసింది. వేధింపులకు పాల్పడిన వడ్డీ వ్యాపారులు పరారీలో ఉన్నారు.