నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున నీలాయిపేట దగ్గర కారు డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు నుజ్జు నుజ్జు అయ్యింది. వెనక టైర్ ఊడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న తండ్రి అశోక్ (45), కూతురు కృతిక (20) అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు ఆదిలాబాద్‌లోని రవీంద్ర నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.
ఆదిలాబాద్ జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. నేరడిగొండ మండలం మామడ టోల్ ప్లాజా వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న అన్వేష్, వెంకటేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్నవారు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో.. వెంకటేష్ మార్గమధ్యలోనే చనిపోయారు. మృతుడు నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో.. ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ప్రమాదం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురు మిత్రులు దీపేశ్ అగర్వాల్ (23), సంచయ్ మల్పానీ(22), ప్రియాన్ష్ మిత్తల్(23) కలిసి కారులో శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఘట్‌కేసర్ వైపు బయలుదేరారు.
సమయం అర్ధరాత్రి 2 గంటలు అవుతోంది. ఆ సమయంలో కారు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధి గండిచెరువు వంతెన సమీపంలోకి వచ్చింది. అక్కడ నిలిపి ఉంచిన వాహనాన్ని గుర్తించకుండా వేగంగా ఢీకొట్టారు. దీంతో కారు ముందు భాగం ఆ వాహనంలోకి చొచ్చుకెళ్లి మంటలంటుకున్నాయి. ఆ వాహన డ్రైవర్ కారు నుంచి వేరు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
సంబంధిత కథనం