Bhadrachalam Building Collapse : భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. భద్రాచలం సూపర్ బజార్ సెంటర్ లోని 6 అంతస్తుల మేర భవనాన్ని స్లాబ్ వేసి వదిలేశారు. ఈ భవనం బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. బిల్డింగ్ శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనం కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పాత బిల్డింగ్ పైనే మరో నాలుగు అంతస్తులు కడుతుండడంతో ఈ ప్రమాదం జరిగింది.
నిర్మాణ లోపాల కారణంగా ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. భవన నిర్వాహకులు ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి ఈ భవనం నిర్మాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్లు, పొక్లెయిన్లతో సహాయచర్యలు చేపట్టారు. కూలిన భవనం పక్కన ఆలయం కూడా నిర్మిస్తున్నారు.
బిల్డింగ్ కూలడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమీప ఇళ్లలోని ప్రజలు ప్రాణ భయంతో బయటికి పరుగులు పెట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. భవనం కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో విషాదం అలుముకున్నాయి. బిల్డింగ్ కూలిన విషయం తెలుసుకుని ఇంటి యజమాని శ్రీపతి శ్రీనివాసరావు పరారయ్యారని సమాచారం. భద్రాచలం రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్ లో నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనం నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగా నిర్మించారని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదు చేశారు. ఐటీడీ పీఓ ఈ భవనాన్ని కూల్చివేయాలని పంచాయతీ శాఖను ఆదేశించినట్లు సమాచారం.
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను కింద స్థాయి అధికారులు బేఖాతార్ చేయడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భద్రాచలంలో అనేక బిల్డింగ్ నిర్మాణాలు ఈ తరహాలోనే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పీఠం పేరుతో పాత భవనంపై మరో నాలుగు అంతస్థులు నిర్మిస్తున్నారు. గత ఏడాది పంచాయతీ సిబ్బంది నిర్మాణాన్ని అడ్డుకోవడంతో..అప్పటి నుంచి నిర్మాణం నిలిచిపోయినట్లు సమాచారం. నిర్మాణాన్ని అడ్డుకున్న సమయంలో పంచాయతీ సిబ్బందితో భవన యాజమాని దురుసుగా ప్రవర్తించారని స్థానికులు చెబుతున్నారు. అమ్మవారి ఆలయాన్ని నిర్మించి, ఆ పక్కనే ఆరు అంతస్తుల బిల్డింగ్ నిర్మించారు. ఒకవేల ఈ భవనం పూర్తై భక్తులు ఉండి ఉంటే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడుగురు కూలీలు ఇవాళ పని చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే భవన యజమాని భార్య మాత్రం ఇద్దరు కూలీలు మాత్రమే పనిచేస్తున్నారని అంటున్నారు. ప్రొక్లైయిన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు.
సంబంధిత కథనం