Warangal Airport : మామునూరు ఎయిర్‌పోర్టు భూములపై మళ్లీ లొల్లి.. రోడ్డెక్కిన అన్నదాతలు-farmers obstruct warangal airport land survey ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Airport : మామునూరు ఎయిర్‌పోర్టు భూములపై మళ్లీ లొల్లి.. రోడ్డెక్కిన అన్నదాతలు

Warangal Airport : మామునూరు ఎయిర్‌పోర్టు భూములపై మళ్లీ లొల్లి.. రోడ్డెక్కిన అన్నదాతలు

HT Telugu Desk HT Telugu

Warangal Airport : కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు భూములపై మళ్లీ లొల్లి మొదలైంది. తమకు న్యాయం చేయకుండా భూములు తీసుకుంటే ఊరుకునేది లేదని నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపెల్లి గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు ఆందోళనకు దిగారు.

ఆందోళన చేస్తున్న రైతులు

మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన పనుల్లో భాగంగా.. మంగళవారం రెవెన్యూ అధికారులు భూముల సర్వేకు వెళ్లారు. వారిని అడ్డుకుని రైతులు నిరసన చేపట్టారు. జై జవాన్.. జై కిసాన్ అంటూ రోడ్డెక్కి నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మామునూరు సీఐ ఒంటేరు, ఇతర పోలీస్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ తమకు న్యాయం జరిగేదాక భూముల సర్వే ముందుకు కదలనివ్వబోమని రైతులు స్పష్టం చేశారు. దీంతో మామునూరు ఎయిర్ పోర్టు సమీపంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఎమ్మార్వో నాగేశ్వరరావు ఇతర అధికారులు అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

మార్కెట్ రేటు ప్రకారం..

మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు తాము వ్యతిరేకం కాదని భూములు కోల్పోతున్న రైతులు స్పష్టం చేశారు. ఇక్కడ భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టు కింద భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని, అంతేగాకుండా విమానాశ్రయం పునరుద్ధరణలో భాగంగా నక్కలపల్లి రహదారిని క్లోజ్ చేస్తున్నారని.. తమకు ప్రత్యామ్నాయంగా మరో రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇక్కడి రైతుల డిమాండ్ ను ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లించని లేని పక్షంలో భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మంత్రి మాట నిలబెట్టుకోవాలి..

ఎయిర్ పోర్టు భూసేకరణపై గతంలో నిర్వహించిన సమావేశం సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ రైతులకు హామీ ఇచ్చారని.. బహిరంగ మార్కెట్ ప్రకారం రేటు చెల్లిస్తామని చెప్పారని రైతులు చెబుతున్నారు. ఆ లెక్క ప్రకారం మామునూరు ఎయిర్ పోర్టు చుట్టుపక్కల రూ.5 కోట్లకుపైగా ధర పలుకుతోందని, దాని ప్రకారమే అన్నదాతలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులు కోరుకున్న ప్రకారం వ్యవసాయ భూములు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడేమో తమకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే సర్వే మొదలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

భారీగా మోహరించిన పోలీసులు..

నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి, నల్లకుంట గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. రైతుల ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని, వెంటనే ఆందోళన విరమించాల్సిందిగా సూచించారు. కానీ తమ జీవనోపాధికి సంబంధించిన అంశం కావడంతో అన్నదాతలు రోడ్డుపై నినాదాలతో హోరెత్తించారు. దాదాపు 200 మంది వరకు పోలీసులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనగా.. తమకు న్యాయం జరిగేంతవరకు ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చేది లేదని అక్కడి రైతులు స్పష్టం చేస్తున్నారు. విమానాశ్రయ పునరుద్ధరనకు ఇంకో 253 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.