Telangana Farmers : సన్నాల సాగుకు సై.. ఫలించిన బోనస్ ప్రయత్నం.. యాసంగిలో భారీగా పెరిగే అవకాశం!-farmers in telangana are opting for thin rice cultivation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Farmers : సన్నాల సాగుకు సై.. ఫలించిన బోనస్ ప్రయత్నం.. యాసంగిలో భారీగా పెరిగే అవకాశం!

Telangana Farmers : సన్నాల సాగుకు సై.. ఫలించిన బోనస్ ప్రయత్నం.. యాసంగిలో భారీగా పెరిగే అవకాశం!

Basani Shiva Kumar HT Telugu
Jan 24, 2025 09:43 AM IST

Telangana Farmers : గతంలో తెలంగాణలో చాలా వరకు సన్న వడ్లను పండించేవారు కాదు. దిగుబడి తక్కువ వస్తుందని, పెట్టుబడి ఎక్కువ అవుతుందని దొడ్డు రకం వడ్లను పండించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో.. ఎక్కువమంది సన్నాల సాగుకు సై అంటున్నారు.

సన్నాల సాగు
సన్నాల సాగు (unsplash)

తెలంగాణలో యాసంగి సీజన్‌లో సన్న వడ్లు సాగు చేసేందుకే అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు. వానాకాలంలో సన్న వడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇచ్చింది. దీంతో యాసంగిలోనూ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈసారి యాసంగిలో 54 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు అవుతుందని అంచనా వేస్తున్నారు. అందులో సుమారు 40 లక్షల ఎకరాల్లో సన్నాలు పండించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

yearly horoscope entry point

అధికారుల ఏర్పాట్లు..

సన్నాలను ఎక్కువగా పండించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అందుకు తగినట్టు అధికారులు విత్తనాలను సరఫరా చేశారు. వానాకాలం సీజన్‌లో విత్తనాలకు కొరత ఏర్పడింది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఇబ్బంది లేకుండా డిసెంబర్ ​మొదటి వారంలోనే విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే చాలాచోట్ల వరినాట్లు ముగిశాయి. అటు చెరువుల్లో నీరు కూడా పుష్కలంగా ఉంది. దీంతో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి.

సన్న బియ్యానికి డిమాండ్..

మార్కెట్‌లో సన్న బియ్యానికి డిమాండ్ ఉంది. ప్రజలు సన్న బియ్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో.. మిల్లర్లు, ట్రేడర్లు రైతుల వద్దే వడ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా రైతులను ప్రోత్సహిస్తోంది. వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ కలిసి క్వింటాల్‌కు రూ.2,830 చెల్లించింది. ఇటు ప్రైవేటు వ్యాపారులు కూడా సన్న వడ్లకు రూ.3,200 వరకు చెల్లించి కొనుగోలు చేశారు.

అంచనాలు ఇలా..

మద్దతు ధర లభించడం, మార్కెట్‌లో డిమాండ్ ఉండటం, ప్రభుత్వం బోనస్ ఇస్తుండడంతో.. రైతులు ఈసారి సన్న వడ్లు సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో దాదాపు 85 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 2023-24లో 174.18 లక్షల దొడ్డు ధాన్యం, 86.26 లక్షల సన్నధాన్యం దిగుబడి వచ్చింది. ఈసారి సన్న వడ్ల దిగుబడి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఎక్కువగా ఇవే..

తెలంగాణలో ఎక్కువగా కావేరి, హెచ్ఎంటీ, చింటూ, ఆర్ఎన్‌ఆర్, కేఎన్ఎం, వర్ష, జైశ్రీరామ్, బీపీటీ వంటి సన్న రకాలను సాగు చేస్తున్నారు. కొన్ని జిల్లాలో సాయి రామ్, సాయిరామ్ గోల్డ్, దఫరి 1008, అక్షయ, అక్షయ గోల్డ్, సిరి, సమృద్ధి, జీకె సావిత్రి, దివ్యజ్యోతి, అంకుర్ 101, డబ్ల్యూజీఎల్ 14 రకాలు వేస్తున్నారు. రకం ఏదైనా సన్నాలకు మాత్రం భారీగా డిమాండ్ ఉంటోంది.

రైతులకు మేలు..

సన్నాలను పండించిన రైతులు మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం లేదు. చాలా గ్రామాల్లో వడ్లను మిల్లుల్లో పట్టించి.. బియ్యాన్ని కూడా అమ్ముతున్నారు. అలాగే వారు తినడానికి ఉంచుకుంటున్నారు. ఎలా చేసిన రైతులకు మేలే జరుగుతోంది. అందుకే సన్నాలు పండించేందుకు అన్నదాతలు మొగ్గు చూపుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

Whats_app_banner