Rajanna Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములను అక్రమంగా పొంది... కేసులకు భయపడి స్వచ్ఛందంగా అప్పగింత
Rajanna Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూకబ్జాదారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ భూములను అక్రమంగా పొందిన వారు స్వచ్ఛందంగా సర్కార్ కు సరెండర్ చేస్తున్నారు. పండుగ పూట ఇద్దరు రైతులు గతంలో అక్రమంగా పొందిన భూమిని ప్రభుత్వానికి అప్పగించారు.
Rajanna Siricilla: సంక్రాంతి పండుగ పూట రాజన్న సిరిసిల్లలో ఇద్దరు రైతులు అక్రమంగా పొందిన ఆరు ఎకరాల ప్రభుత్వ భూముల పట్టాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ కు అప్పగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెయ్యికి పైగా ఎకరాల ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అయ్యాయి.
ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తుంది. ఐదు కేసులు నమోదుచేసి ఐదుగురిని అరెస్టు చేయడంతో ప్రభుత్వ భూములను అక్రమంగా పొందిన వారు సర్కార్ కు సరెండర్ చేసేందుకు క్యూ కడుతున్నారు. బుధవారం తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన కూనవేణి నర్సయ్య సర్వే నెంబర్ 464/4లో గల 5 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమంగా పొందానని ఈ భూమి తనకు వద్దని భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ కు అందజేశారు. అదే విధంగా మండేపల్లి కి చెందిన బుస్స లింగం సర్వే నెంబర్ 365/అ/2లో ఎకరం ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అప్పగించారు.
వారం రోజుల క్రితం లక్ష్మీపూర్ మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ రెండెకరాల ప్రభుత్వ భూమిని, సారంపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా 3 ఎకరాల అసైన్డ్ భూమిని తన కబ్జాలో ఉందని కుమారస్వామి అనే వ్యక్తి కలెక్టర్, ఎస్పీల సమక్షంలో ప్రభుత్వానికి భూమి పత్రాలు అప్పగించారు.
రైతు బంధు నిధులు రికవరీ చేస్తాం... కలెక్టర్
ప్రభుత్వ భూములను అక్రమంగా పొందిన వారు రైతు బంధు, పీఎం కిసాన్ పెట్టుబడి సహాయం పొందడంతోపాటు పంట రుణాలు సైతం తీసుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఆ డబ్బులను రికవరీ చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. ప్రస్తుతం భూమి అప్పగించిన బుస్స లింగం ప్రభుత్వ భూమిని అక్రమంగా పొందడమే కాకుండా ఆ భూమిని బ్యాంకులో తనఖా పెట్టి క్రాప్ లోన్ సైతం తీసుకున్నాడని తెలిపారు. భూములు స్వచ్ఛందంగా అప్పగించే వారికి డిమాండ్ నోటీస్ ఇచ్చి రైతుబంధు నిధులను రికవరీ చేయడం జరుగుతుందన్నారు.
స్వచ్చందంగా అప్పగిస్తే పేదలకు ఇస్తాం... కలెక్టర్
జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించినా , అక్రమంగా పొందిన వెంటనే ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. ఇప్పటివరకు 250 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పొందినట్లు గుర్తించామని వారంతా స్వచ్ఛందంగా అప్పగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండదని తాము రంగంలోకి దిగి స్వాధీనం చేసుకుంటే చట్ట పరంగా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.
ప్రభుత్వ భూములను అక్రమంగా పొంది తిరిగి సర్కార్ కు సరెండర్ చేస్తే ఆ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని, పేదల ఇళ్ళ స్థలాలుగా పంపిణీ చేసి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇటు రెవెన్యూ అధికారులు అటు పోలీసులు భూకబ్జా దారులపై నజర్ వేయడంతో కబ్జాదారులు భయాందోళన చెందుతున్నారు. స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించే పనిలో నిమగ్నమయ్యారు.