rythu runa mafi: తెలంగాణలో రైతులకు మళ్లీ సంకెళ్లు.. కారణం వింటే ఆశ్యర్యపోతారు!
rythu runa mafi: తెలంగాణలో రైతుల చేతులకు మళ్లీ సంకెళ్లు పడ్డాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తమకు రుణమాఫీ కాలేదని రోడ్డెక్కిన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
రుణమాఫీ కాలేదన్న రైతులకు సంకెళ్లు పడ్డాయి. తమకు రుణమాఫీ కాలేదని నిరసన వ్యక్తం చేసిన 11 మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. దీనికి రాజకీయ రంగు అంటుకుంది. ఓ మంత్రి ఈ రైతుల అరెస్ట్ వెనక ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కాలేదని.. రెండు రోజుల కిందట అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో.. శవ యాత్ర చేసి రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు.
మంత్రి ఆదేశంతో..
రైతులు చేసిన ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఆందోళనల వల్ల ప్రభుత్వం పరువు పోతోందని.. కచ్చితంగా వారి మీద కేసులు పెట్టాలని ఓ మంత్రి ఆదేశించినట్టు సమాచారం. ఈ నిరసనలో పాల్గొన్న గోక లక్ష్మారెడ్డి, పుండ్రు ఉపేందర్ రెడ్డి, ఉరుకొండ దత్తు, నిమ్మల సూర్యసేన్ రెడ్డి, విపుల్ రెడ్డి, నక్క ధనుంజయ్, కుమ్మరి భూమన్న, బహద్దూర్ నర్సింహులు, అల్లూరి సతీష్ రెడ్డి, నిమ్మల సుదర్శన్ రెడ్డి, పుండ్రు పోతారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆందోళన అవసరం లేదు..
కాంగ్రెస్ సర్కారు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. మూడు విడతల్లో రూ. 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేసింది. అయితే.. చాలామంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. ఆ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో తెలంగాణ వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. రుణమాఫీ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది.
స్థానిక అధికారులను సంప్రదించండి..
జులై 18న లక్ష లోపు రుణాలు, జులై 31న లక్ష నుంచి లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేశామని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఆగస్టు 15న లక్షన్నర నుంచి రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రుణమాఫీపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. రూ.2 లక్షలలోపు రుణం ఉండి.. ఇప్పటికీ మాఫీ కాని రైతులు స్థానిక ఏవోను కలిసి.. కారణం తెలుసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే అధికారులు అడిగిన పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత రుణ మాఫీ జరుగుతుందని వెల్లడించింది.