Farmer Suicide: పొలాన్ని ఆక్రమించు కోవడంతో పురుగుల మందు తాగి ఖమ్మం జిల్లా చింతకాని రైతు ఆత్మహత్య
Farmer Suicide: పొలం ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కలత చెందిన రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. తన పొలాన్ని విడిపించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Farmer Suicide: ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో పొలాన్ని ఆక్రమించుకోవడంతో రైతు పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింద.ి
తనకు న్యాయం జరగక పోవడంతో చనిపోతున్నానని తన ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి వీడియో ద్వారా తెలియజేయాలని వేడుకుంటూ రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రొద్దుటూరు సర్వేనంబర్ 276, 277లో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి ట్రాక్టర్లు, జేసీబీలు, బుల్డోజర్లతో ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నారని రైతు వీడియోలో ఆరోపించారు. గ్రామానికి చెందిన కూరపాటి కిషోర్, పెండ్యాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావుమంగలి శ్రీను, ముత్తయ్యలతో కలిసి తన పొలాన్ని నాశనం చేశారని బాధిత రైతు వీడియోలో ఆరోపించాడు. తన పొలాన్ని కాపాడాలని ప్రాధేయ పడినా కనికరించలేదన్నారు.
తన పొలాన్ని బుల్డోజర్లతో తొక్కించారని చింతకాని ఎమ్మార్వో, ఎస్సైలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వస్తే, టైమ్ అయిపోయిందని చెప్పారని వాపోయాడు. తనకు మరో మార్గం లేక చనిపోతున్నానని తనకున్న ఏడెకరాల పొలంలో మూడెకరాల పది కుంటల పొలాన్ని ఆక్రమించి ధ్వంసం చేశారని వాపోయాడు.
ముఖ్యమంత్రి, భట్టి విక్రమార్క తనకు న్యాయం చేయాలని, రైతుగా బతికానని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని, తాను ఉన్నా లేకపోయినా తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు.
రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియోలో విలపించాడు. వీడియోను సన్నిహితులకు పంపిన ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.