Rythu Runa Mafi : పురుగుల మందే పెరుగన్నం అయ్యింది.. రుణమాఫీ కాలేదని.. మరో రైతు ఆత్మహత్య-farmer committed suicide in dornakal of mahabubabad district because of rythu runa mafi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Runa Mafi : పురుగుల మందే పెరుగన్నం అయ్యింది.. రుణమాఫీ కాలేదని.. మరో రైతు ఆత్మహత్య

Rythu Runa Mafi : పురుగుల మందే పెరుగన్నం అయ్యింది.. రుణమాఫీ కాలేదని.. మరో రైతు ఆత్మహత్య

Basani Shiva Kumar HT Telugu
Oct 01, 2024 10:43 AM IST

Rythu Runa Mafi : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై ఆ రైతు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అప్పలన్నీ తీర్చేసి.. సంతోషంగా వ్యవసాయం చేసుకుందాం అనుకున్నాడు. కానీ.. రుణమాఫీ కాలేదు. అటు బ్యాంకులు, ఇటు సహకార సంఘాలు, మరోవైపు అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేశారు. దీంతో ఆ అన్నదాత తనువు చాలించాడు.

పొలంలో రైతు ఆత్మహత్య
పొలంలో రైతు ఆత్మహత్య (@umasudhir)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. వాటిల్లో రైతు రుణమాఫీ ప్రధానమైంది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చాలామందికి రుణమాఫీ అయ్యింది. కానీ.. రుణమాఫీ కానివారు ఇంకా ఉన్నారు. వారు అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయారు. రుణమాఫీపై అశలు వదులుకుంటున్నారు. కొంతమంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు.

తాజాగా.. రుణమాఫీ కాలేదని, ఆర్ధిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ధారావతు తండాలో జరిగింది. తండాకు చెందిన ధారావతు రవి(53) అనే రైతు ఆర్థిక ఇబ్బందులు, రుణమాఫీ కాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ తండాలో విషాదం నెలకొంది.

రోజూలానే రవి పొలానికి వెళ్లాడు. కానీ.. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని భార్య.. భర్తను వెతుక్కుంటూ వెళ్లింది. ఆమెకు గుండెలు బరువెక్కే దృశ్యం కనిపించింది. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో కనిపించాడు తన భర్త. కేకలు వేస్తూ.. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చింది. స్థానికులు 108 వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. రవి, అతని భార్య పేరిట బ్యాంకులో రూ.2,46,000 రుణం ఉంది. అది మాఫీ కాకపోవడంతో పాటు.. ఇతర అప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తండా వాసులు చెబుతున్నారు. రుణమాఫీ అయితే.. ఇప్పుడు వచ్చే పంటతో అప్పులు తీర్చేసి.. సంతోషంగా వ్యవసాయం చేసుకుంటానని రవి చెప్పినట్టు తోటి రైతులు చెబుతున్నారు.

అధికారుల దగ్గర వివరాలు..

మూడు విడతల్లోనూ రుణమాఫీ కాని రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరించారు. రేషన్ కార్డు లేకపోవడంతో 4 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్ల పేర్లలో తప్పుల వల్ల మరో 1.50 లక్షల మందికి రుణమాఫీ కాలేదని నిర్థారించారు. మొత్తం 5 లక్షలకు పైగా అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ప్రభుత్వం ఆమోదం తెలపగానే వీరందరికీ రుణమాఫీ రూ.5 వేల కోట్లు అకౌంట్లలో జమ అవ్వనుంది.