Jagtial News : జగిత్యాల జిల్లాలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య, ముగ్గురు మృతితో మద్దులపల్లిలో విషాదం
Jagtial News : జగిత్యాల జిల్లాలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకుంది. రెండ్రోజుల క్రితం మహిళ మృతి చెందగా, చికిత్స పొందుతూ ఆదివారం నాడు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. భర్త వేధింపులు, క్షణికావేళంతోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Jagtial News : క్షణికావేశం తల్లితో పాటు ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది. భర్తపై కోపంతో పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య చేసుకుంది. తల్లి రెండు రోజుల క్రితం మృతి చెందగా ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఆదివారం ప్రాణాలు వదిలారు. ముగ్గురు మృతితో జగిత్యాల జిల్లా మద్దులపల్లిలో విషాదం నెలకొంది.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. కంబాల హారిక భర్త తిరుపతిపై కోపంతో తొమ్మిదేళ్ళ కొడుకు కృష్ణాంత్, 8 ఏళ్ళ కూతురు మాయంతలక్ష్మికి ఈనెల 14న సాయంత్రం గడ్డి మందు తాగించి తాను తాగి ఆత్మహత్య చేసుకుంది. హారిక 14న రాత్రి జగిత్యాల ఆసుపత్రిలో మృతి చెందగా ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉండగా హైదరాబాద్ కు తరలించారు. ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. తల్లి ఇద్దరు పిల్లల మృతికి భర్త తిరుపతే కారణమని హారిక పుట్టింటివారు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వేధింపులు...అక్రమ సంబంధం
ఒగ్గు కళాకారుడు అయిన తిరుపతికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని హారిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం తిరుపతి హారికకు వివాహం కాగా ఇద్దరు పిల్లలు పుట్టాక వరకట్నం కోసం వేధించడంతోపాటు మరో మహిళను ఇంటిదాకా తీసుకురావడంతోనే మనస్తాపం చెంది భర్తకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు పుట్టింటివారు తెలిపారు. హారిక ఇద్దరు పిల్లల మృతికి కిరణమైన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా చర్యలు ఉండాలని హారిక సోదరుడు, మరదలు విజ్ఞప్తి చేశారు.
భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
భార్య ఇద్దరు పిల్లలు మృతితో ఇక తానెందుకు బతకాలని బోరున విలపించాడు భర్త తిరుపతి. హారిక పుట్టింటి వారు ఫిర్యాదు మేరకు పెగడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యకు ముందు వీడియో కాల్ లో హారిక భర్త తిరుపతితో మాట్లాడి సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలపడంతో హారిక తిరుపతి సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పెగడపల్లి ఎస్ఐ రవికిరణ్ తెలిపారు. వేధింపులు, క్షణికావేశంతోనే ఈ దారుణం జరిగినట్లు భావిస్తున్నారు.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం