Cyber Crime: ములుగు కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్, ఉజ్బెకిస్తాన్ నుంచి డబ్బులు డిమాండ్-fake whatsapp account in the name of mulugu collector demanding money from uzbekistan ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cyber Crime: ములుగు కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్, ఉజ్బెకిస్తాన్ నుంచి డబ్బులు డిమాండ్

Cyber Crime: ములుగు కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్, ఉజ్బెకిస్తాన్ నుంచి డబ్బులు డిమాండ్

HT Telugu Desk HT Telugu
Sep 26, 2024 08:46 AM IST

Cyber Crime: సైబర్ నేరగాళ్లు జిల్లా అధికారుల పేరుతో జనాలకు టోకరా వేస్తున్నారు. ఇదివరకే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు కలెక్టర్లు, పోలీసు ఆఫీసర్ల పేరుతో ఫేస్ బుక్, వాట్సాప్ అకౌంట్ల ద్వారా డబ్బులు దండుకునే ప్రయత్నం చేయగా.. తాజాగా బాధితుల జాబితాలో ములుగు కలెక్టర్ కూడా చేరారు.

ములుగు కలెక్టర్‌ పేరిట వాట్సప్‌ సందేశాలు
ములుగు కలెక్టర్‌ పేరిట వాట్సప్‌ సందేశాలు

Cyber Crime: ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. అనంతరం ఆ ఫేక్ అకౌంట్ ద్వారా పలువురి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. కలెక్టర్ దివాకర్ ఒక మీటింగ్ లో ఉన్నారని, ఆయనకు అర్జెంట్ గా డబ్బులు కావాలంటూ కొందరు అధికారులకు 99888 6747021 అనే నెంబర్ నుంచి మెసేజ్ లు పంపించారు.

డబ్బులు పంపించిన అనంతరం అమౌంట్ ట్రాన్స్ ఫర్ అయినట్టుగా స్క్రీన్‌ షాట్ అదే నెంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాల్సిందిగా ఆ మెసేజ్ లో కోరాడు. దీంతో ఆ మెసేజ్ లు అందుకున్న కొంతమంది అధికారులు మొదట కలెక్టర్ డబ్బులు అడగడమేంటని ఆశ్చర్యానికి గురయ్యారు. అనుమానం రావడంతో వెంటనే విషయాన్ని కలెక్టర్ దివాకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అది సైబర్ నేరగాళ్ల పనిగా గుర్తించిన కలెక్టర్ దివాకర వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

డబ్బులు డిమాండ్ చేసిన నెంబర్ ను పోలీసులు ట్రేస్ చేసే ప్రయత్నం చేయగా.. అది ఉజ్బెకిస్తాన్ కు చెందిన నెంబర్ గా తేలింది. కాగా సైబర్ నేరగాళ్ల విషయంపై కలెక్టర్ దివాకర్ తన ఒరిజినల్ అకౌంట్ ద్వారా స్పందించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జనాలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. తన పేరుతో డబ్బులు ఎవరు అడిగినా ఇవ్వకూడదని సూచించారు.

ఆ నెంబర్ నుంచి వచ్చే మెసేజ్ లకు ఎవరూ రెస్పాండ్ అవ్వొద్దని పేర్కొన్నారు. ఒకవేళ ఆ నెంబర్ నుంచి మెసేజ్ లు ఏమైనా వస్తే వీలైనంత తొందరగా ఆ నెంబర్ ను బ్లాక్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా కలెక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు.

వరంగల్ కలెక్టర్.. సీపీ పేరున ఫేక్ అకౌంట్లు

రెండు నెలల కిందట వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేరున గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేశారు. అనంతరం ఆ ఐడీ నుంచి కొంతమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడంతో పాటు అర్జంటుగా డబ్బులు అవసరం ఉన్నాయని, ఫోన్ పే చేయాల్సిందిగా మెసేజ్ లు పంపించడం మొదలు పెట్టారు. ఆ విషయాన్ని కొంతమంది వెంటనే సీపీ అంబర్ కిషోర్ ఝా దృష్టికి తీసుకెళ్లగా, తన పేరున ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తే ఎవరూ యాక్సెప్ట్ చేయొద్దని సీపీ అఫీషియల్ గా ప్రకటన కూడా విడుదల చేయాల్సి వచ్చింది.

ఆ తరువాత వారం రోజులకే వరంగల్ కలెక్టర్ సత్య శారదా పేరుతో కూడా సైబర్ నేరగాళ్లు ఫేక్ ఐడీ సృష్టించారు. అనంతరం ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి తాను మీటింగ్ లో ఉన్నానని, అర్జంట్ గా డబ్బులు కావాలంటూ మెసేజ్ లు పంపించారు. +94784977145 నెంబర్ కు డబ్బులు పంపించాలని కోరారు. డబ్బులు ఫోన్ పే ద్వారా పంపించి, స్క్రీన్ షాట్ షేర్ చేయాలని మెసేజ్ లో పేర్కొన్నారు.

దీంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ సత్య శారదా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వరంగల్ కలెక్టర్ పేరున డబ్బులు అడిగిన నెంబర్ ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ఆ నెంబర్ శ్రీలంక దేశానికి చెందినదిగా గుర్తించారు. కానీ ఆ నెంబర్ నిజంగా శ్రీలంకకు చెందినదేనా లేదా ఫేక్ లొకేషన్ తో మోసాలకు పాల్పడుతున్నారా అనే కోణంలో దర్యాప్తు జరిపారు.

కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఆ విషయం కాస్త తెరమరుగైంది. కాగా ఆఫీసర్ల పేరున డబ్బులు అడగడం ఇటీవల చాలా చోట్ల జరిగిందని, గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంపి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)