Warangal Crime : నకిలీ నోట్ల దందా గుట్టురట్టు - రింగ్ రోడ్డుపై అడ్డంగా దొరికిపోయారు..!
Fake currency racket in Warangal : నకిలీ నోట్ల ముఠాను వరంగల్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లను విక్రయాలకు పాల్పడతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 21లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
కరెన్సీ నోట్లకు రెండింతలు అసలు నోట్లు, నాలుగింతలు నకిలీ నోట్లు ఇస్తామంటూ దందాకు పాల్పడుతున్న వ్యక్తులతో పాటు నకిలీ నోట్లు కొనుగోలు చేస్తున్న ముఠా సభ్యులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా 8 మంది సభ్యులను అరెస్టు చేసి రూ.38.84 లక్షల అసలు, రూ.21లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ నోట్ల ముద్రణకు అవరమైన తెల్ల కాగితాలు, ఒక కారు, ఆటో, తొమ్మిది సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి గ్రామానికి చెందిన మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం చేసేవాడు. ఈ వ్యాపారం ద్వారా నిందితుడికి వచ్చే అదాయం తన అవసరాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఓ స్కెచ్ వేశాడు. తన ప్లాన్‌లో భాగంగా మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం ద్వారా పరిచయమైన వ్యక్తులతో తనకు అడవిలో డబ్బులతో కూడిన డ్రమ్ము దొరికిందని నమ్మించాడు. అందులోని డబ్బును బయటకు తీస్తే తన కుటుంబంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చాడు. తనకు ఎవరైనా ఒక రూ.లక్ష ఇస్తే వారికి అ డ్రమ్ములోని డబ్బు రెండు రెట్లు, అలాగే అసలైన నోట్లకు మార్కెట్ లో చెలామణి చేసేందుకు నాలుగు రెట్లు నకిలీ నోట్లు ఇస్తానని చెప్పుకున్నాడు.
నాలుగింతలు నకిలీ నోట్లు…..
మణికాల కృష్ణ తనకు ఇదివరకే గొర్రెల వ్యాపారంలో పరిచయం అయిన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్ వద్ద మొదట తన ప్లాన్ అమలు చేసి సక్సెస్ అయ్యాడు. తన ప్లాన్ లో భాగంగా పాల్వంచ అటవీ ప్రాంతంతో తనకు డబ్బు దొరికిందని చెప్పి, అందులోంచి ఒక నోట్ల కట్టను శ్రీనివాస్ కు ఇచ్చాడు. దానిని పరిశీలించిన శ్రీనివాస్ అవి అసలైన నోట్లని నమ్మాడు.
అనంతరం శ్రీనివాస్ రూ.10 లక్షల విలువైన అసలు నోట్లు ఇస్తే డ్రమ్ములోని రూ.20 లక్షలు, దాంతో పాటు రూ.లక్ష విలువైన అసలైన నోట్లకు నాలుగింతలు నకిలీ నోట్లు కూడా ఇస్తానని చెప్పడంతో శ్రీనివాస్ మరో రూ.5 లక్షలు ఇచ్చి, రూ.20 లక్షలు మార్పిడీ చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. ఈ మేరకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదరగా…. ఆ డబ్బును హనుమకొండకు తీసుకువచ్చి అందజేయాలని ఎర్రగొల్ల శ్రీనివాస్ షరతు పెట్టాడు. దీంతో కృష్ణ అందుకు ఒప్పుకున్నాడు.
రింగ్ రోడ్డే స్పాట్…
ఒప్పందం ప్రకారం మణికాల కృష్ణ తన స్నేహితులైన కర్నూలు జిల్లా కుర్వపేటకు చెందిన బిజిని వేముల వెంకటయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నక్రిపేట తండాకు చెందిన ధరంసోత్ శ్రీను, తేజావత్ శివ, మూకమామిడికి చెందిన గుగులోతు వీరన్నతో కలిసి శనివారం వరంగల్ రింగ్ రోడ్డుపై పెగడపల్లి క్రాస్ వద్దకు వచ్చాడు.
ఇటు వైపు ఎర్రగొల్ల శ్రీనివాస్ తన బంధువులై కేశవాపూర్ గ్రామానికి చెందిన ఉడుత మల్లేశ్, హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్య పల్లికి చెందిన ఎర్రగొల్ల అజయ్ తో అక్కడికి చేరుకున్నారు. కాగా రింగ్ రోడ్డుపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పెగడపల్లి క్రాస్ వద్ద కొంతమంది అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించారు.
వారి వద్ద ఉన్న బ్యాగులు, కారు తనిఖీ చేయగా.. అసలు బాగోతం బయటపడింది. పెద్ద మొత్తంలో అసలు నగదుతో పాటు, నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవసరమైన తెల్లకాగితాలను గుర్తించి వారిని అదుపులోని తీసుకున్నారు. తమ స్టైల్ లో విచారణ జరపగా.. నిందితులు అసలు నేరాన్ని అంగీకరించారు. ప్రధాన నిందితుడు మణికాల కృష్ణ, ఇదే తరహలో పలు మార్లు పోలీసులకు చిక్కాడు. సత్తుపల్లి, వి.ఎం.బంజర, లక్ష్మీదేవిపేట పోలీస్ స్టేషన్‌ల్లో అతడిపై కేసులు నమోదయ్యాయి.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ దేవేందర్ రెడ్డి, కేయూసీ సీఐ రవి కుమార్, ఎస్సై మాధవ్, హెడ్‌కానిస్టేబుల్ నర్సింగ్ రావు, కానిస్టేబుళ్లు శ్యాంరాజు, సంజీవ్, సంపత్, హోంగార్డ్ రాజేందర్‌లను సీపీ అంబర్ కిశోర్ ఝా అభినందించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).
సంబంధిత కథనం