అనారోగ్య సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడేస్తానంటూ ఓ బాబా జనాలను నమ్మించాడు. మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు అతగాని దందా ఓవైపు సాగుతుండగా… మరోవైపు అమాయక మహిళలను లొంగదీసుకుంటున్నాడు. ఇలా పలువురిని మోసం చేయటంతో… అసలు విషయం బయటికి వచ్చింది. దీంతో అతగాడి బాగోతం బట్టబయలైంది…! ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే…. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బుడగ జంగం బొమ్మెర బాపు స్వామి అలియాస్ శివ స్వామి జ్యోతిష్యం చెబుతూ పూజలు చేసేవాడు. ఆరోగ్యం మెరుగు పేరిట మహిళలను నమ్మించేవాడు. మెదక్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ తన కార్యకలాపాలను సాగించేవాడు.
నిమ్మ కాయ, పసుపు, కుంకుమ వాసనలు చూపిస్తూ…. నీటిలో నిద్ర మాత్రలు కలిపి తన దగ్గరికి వచ్చే మహిళలకు ఇచ్చేవాడు. సదరు మహిళ సృహ కోల్పోయిన తర్వాత… వారిని శారీరకంగా అనుభవించేవాడు. అంతేకాదు మొబైల్ లో వీడియోలు తీసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళలకు ఫోన్ చేసి నగ్నంగా ఉన్న వీడియోలు ఉన్న విషయం చెప్పి బ్లాక్ మెయిల్ చేసేవాడు. దీనితో మహిళల ఆర్థిక స్తోమతను బట్టి వేల నుంచి లక్షలు డిమాండ్ చేసి వసూల్ చేసేవాడు. ఇతర జిల్లాల్లో కూడా ఇదే విధంగా జ్యోతిష్యం పేరుతో వసూలు చేసిన చరిత్ర స్వామికి ఉన్నట్టు గుర్తించాం అని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
బాపు స్వామి చేస్తున్న బ్లాక్ మెయిల్ వ్యవహారం పోలీసుల వరకు చేరింది. బాధితుల నుంచి అందిన పక్కా సమాచారంతో నిఘా పెట్టి నర్సాపూర్ లో స్వామిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరిపి అతని మొబైల్ ఫోన్ లో మహిళల నగ్న వీడియోలు, బ్లాక్ మెయిల్ చేసి వసూల్ చేసిన ఆన్ లైన్ వివరాలను గుర్తించారు. అతడి వద్ద మంత్రాలకు సంబంధించిన సామాగ్రితో పాటు షర్నకోల, పసుపు, కుంకుమ, గజ్జెలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.
జ్యోతిష్యం పేరిట వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏడవ తరగతి చదివిన స్వామి లాంటి వారు ఆరోగ్యం ఎలా బాగు చేస్తాడనే విషయాన్ని గుర్తించాలన్నారు. మంత్రాలు, జ్యోతిష్యం లాంటివి నమ్మి మోసపోవద్దని… ఈలాంటి వారు గ్రామాలకు వస్తే పోలీసులకు సమచారం ఇవ్వాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో నర్సాపూర్ సీఐ ఏమిరెడ్డి జాన్ రెడ్డి, డిసిఆర్‌బి ఇన్స్పెక్టర్ మధుసూదన్ తదితరులు ఉన్నారు.