Ramarajyam Army Row : 'రామరాజ్యం' ఆర్మీ కేసులో కీలక అంశాలు.. ప్రతి నెల రూ.20 వేల జీతం!-facts about the ramarajyam army that attacked the chilkur temple priest ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ramarajyam Army Row : 'రామరాజ్యం' ఆర్మీ కేసులో కీలక అంశాలు.. ప్రతి నెల రూ.20 వేల జీతం!

Ramarajyam Army Row : 'రామరాజ్యం' ఆర్మీ కేసులో కీలక అంశాలు.. ప్రతి నెల రూ.20 వేల జీతం!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 11, 2025 11:35 AM IST

Ramarajyam Army Row : చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి వ్యవహారంలో.. రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఈ దాడికి పాల్పడిన రామరాజ్యం ఆర్మీ గురించి తాజాగా సంచలన విషయాలు తెలిశాయి. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి.. వివరాలు సేకరిస్తున్నారు.

రామరాజ్యం ఆర్మీ
రామరాజ్యం ఆర్మీ

రామరాజ్యం ఆర్మీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. మొదటి స్లాట్‌లో 5 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రామరాజ్యం ఆర్మీకి తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1,20,599 విరాళాలు అందాయి. 20 నుంచి 50 సంవత్సరాల లోపు వారికి మాత్రమే రామరాజ్యం ఆర్మీలో అవకాశం ఇస్తున్నారు. ప్రతి నెల రూ.20 వేల జీతంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రిజిస్ట్రేషన్లు చేయించింది రామరాజ్యం ఆర్మీ.

ఆరుగురు అరెస్టు..

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో.. వీరరాఘవ రెడ్డి సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 7న రంగరాజన్ పై దాడి జరిగింది. 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగరాజన్. కేసు నమోదు చేసి వీర రాఘవ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేశామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

ఖండించిన డీకే అరుణ..

అర్చకులు రంగరాజన్‌పై దాడిని ఖండించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. రంగరాజన్‌‌ను ఫోన్‌లో పరామర్శించి.. ఘటనపై ఆరా తీశారు. ఇలాంటి దాడులను సహించేది లేదన్నారు. 'రంగారాజన్‌పై దాడి ఘటనలో సమగ్ర విచారణ జరిపించాలి. బాధ్యుడైన రాఘవరెడ్డిపై చర్యలు తీసుకోవాలి. ఆధ్యాత్మికతో సమాజాన్ని భక్తి మార్గంలో నడిపించే అర్చకులపై దాడి సరికాదు. గత కొన్నేళ్లుగా రంగారాజన్ కుటుంబం చేస్తున్న సేవ అనిర్వచనీయం. అలాంటి వారిపై దాడులు అందరూ ఖండించాల్సిందే. రామ రాజ్యస్థాపన ముసుగులో రామసేన పేరిట ఇలాంటి చర్యలు సరికావు' అని డీకే అరుణ స్పష్టం చేశారు.

దురదృష్టకరం..

'చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి దురదృష్టకరం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ దాడి ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా.. ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలి. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి మూక దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలి. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి' అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

కేఏ పాల్ కామెంట్స్..

రంగరాజన్‌పై దాడిని ఖండించారు కేఏపాల్. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'రాముడి పేరుతో రంగరాజన్ పై రామరాజ్యం సైనికులు దాడి చేయడం దారుణం. నిందితులపై నాన్-బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసి జైల్లో పెట్టాలి. సరైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి దాడులు తగ్గుతాయి.. లేదంటే సర్వనాశనమే' అని కేఏ పాల్ హెచ్చరించారు.

Whats_app_banner