దుబాయ్‌లో దారుణం, ఇద్దరు తెలంగాణ వాసులను హత్య చేసిన పాకిస్థానీ- కిషన్ రెడ్డి లేఖతో రంగంలోకి విదేశాంగశాఖ-external affairs intervenes letter from kishan reddy pakistani who murdered two tg residents in dubai ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  దుబాయ్‌లో దారుణం, ఇద్దరు తెలంగాణ వాసులను హత్య చేసిన పాకిస్థానీ- కిషన్ రెడ్డి లేఖతో రంగంలోకి విదేశాంగశాఖ

దుబాయ్‌లో దారుణం, ఇద్దరు తెలంగాణ వాసులను హత్య చేసిన పాకిస్థానీ- కిషన్ రెడ్డి లేఖతో రంగంలోకి విదేశాంగశాఖ

దుబాయ్ లో తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్థానీ యువకుడు అతిదారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించి విదేశాంగ మంత్రికి లేఖ రాశారు.

దుబాయ్‌లో ఇద్దరు తెలంగాణ వాసులను హత్య చేసిన పాకిస్థానీ, కిషన్ రెడ్డి లేఖతో రంగంలోకి విదేశాంగశాఖ

దుబాయ్‌లో ఇద్దరు తెలంగాణ వ్యక్తులను ఓ పాకిస్థానీ యువకుడు కత్తితో పొడిచి చంపిన విషయం కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లా సోన్ కు చెందిన ప్రేమ్ సాగర్(40), నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ దుబాయ్ లోని ఓ బేకరీలో పనిచేస్తు్న్నారు. అదే బేకరీలో పనిచేస్తున్న ఓ పాకిస్థానీ యువకుడు మతవిద్వేషంతో వీరిద్దరిని దారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగు వారు గాయపడిట్లు తెలుస్తోంది. గత శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

దుబాయ్ లో తెలంగాణ వ్యక్తులపై జరిగిన దాడి ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు.

"పొట్టకూటి కోసం దుబాయ్ వలస వెళ్లిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు హత్యకు గురయ్యారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ దురాగతానికి పాల్పడ్డాడని పలు పత్రికలు, మీడియా ద్వారా తెలిసింది. వీరిద్దరూ దుబాయ్‌లోని ఓ బేకరీలో పనిచేస్తున్నారని తెలిసింది. దుండగుడి చేతిలో మరో ఇద్దరు తెలుగు వాళ్లు గాయపడ్డారని తెలుస్తోంది. హంతకుడు కూడా అదే బేకరీలో పనిచేస్తూ మత విద్వేషం కారణంగా ఈ దుశ్యర్యకు పాల్పడ్డాడని, కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన తర్వాత మతపరమైన నినాదాలు చేసినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయంలో మీరు చొరవతీసుకుని మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడంలో సహకరించగలరు" అని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

స్పందించిన విదేశాంగ మంత్రి

ఈ లేఖపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే స్పందించారు. వారి ఆదేశాలకు అనుగుణంగా.. దుబాయ్ లోని భారత కాన్సులేట్ అధికారులు.. ‘బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్’ను సందర్శించి కేసు వివరాలను తెలుసుకున్నారు. ఏప్రిల్ 11, 2025 నాడు ఈ ఘటనకు సంబంధించి.. ఉద్దేశపూర్వక హత్యకేసుగా రిజిస్టర్ చేశామని ఇన్వెస్టిగేటింగ్ పోలీసులు భారత ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు. మోడ్రన్ బేకరీలో పనిచేస్తున్న ఓ పాకిస్థానీ వ్యక్తి.. ఇద్దరు తెలంగాణ వ్యక్తులను అత్యంత దారుణంగా చంపడంతోపాటుగా.. మరో ఇద్దరిని గాయపరిచాడని పోలీసులు వెల్లడించారు.

అయితే ఈ ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఇంకా సిద్ధం కాలేదని, మరికొంత సమయం పడుతుందని తెలిపారు. ఆ వెంటనే మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని భారత కాన్సులేట్ అధికారులు.. అక్కడి విచారణాధికారులకు సూచించారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం