Sangareddy : ట్రాఫిక్ చిక్కులకు చెక్.. సంగారెడ్డి - మదీనాగూడ మధ్య ఎక్స్ ప్రెస్ హైవే
Sangareddy District News:సంగారెడ్డి - హైదరాబాద్‌లోని మదీనాగూడ మధ్య ఉన్న రోడ్డు మార్గాన్ని విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఫలితంగా నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారి 6 వరసలకు పెరగనుంది
Sangareddy: సంగారెడ్డి పరిధిలోని పోతిరెడ్డిపల్లి నుంచి హైదరాబాద్ మదీనాగూడ వరకు ఎక్స్ ప్రెస్ హైవే గా మారనుంది. సంగారెడ్డి జిల్లాలో 65వ నoబర్ జాతీయ రహదారి కీలకమైంది. సంగారెడ్డి నుంచి హైదరాబాద్ లోని మదీనాగూడ మధ్య నాలుగు వరుసలుగా ఉన్న రహదారి ఇప్పుడు ఆరు వరసలకు పెరగనుంది . హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా మీదుగా కర్ణాటక ,మహారాష్ట్రకు వేలాది వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి .రాష్ట్రం లో అయిదు జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్ హెచ్ ఏఐ ) రంగం సిద్ధం చేయగా ,కేంద్రం ఆమోదం తెలిపింది . ఫలితందా జిల్లా ప్రజలు మరింత వేగంగా రాజధానికి చేరుకోవడంతో పాటు ప్రమాదాలు తగ్గుముఖం పట్టనున్నాయి . ఈ హైవే సంగారెడ్డి పరిధిలోని పోతిరెడ్డిపల్లి నుంచి హైదరాబాద్ మదీనాగూడ వరకు 29. 35 కిలోమీటర్ల మేర ఎక్స్ ప్రెస్ హైవే గా మారనుంది .
రూ. 1297. 75 కోట్లు కేటాయించిన కేంద్రం . .
ఈ జాతీయ రహదారి కి రూ. 1297. 75 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు . పనులకు కేంద్ర ,రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది . త్వరలో టెండర్ల నిర్వహణకు ఆ శాఖ అధికారులు ముమ్మరం చేస్తున్నారు . జాతీయ రహదారి విస్తరణకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. రూ. 1200 కోట్లతో 30 కి.మీ. మేర పనులకు ప్రతిపాదించారు .కేంద్రం ఆమోదం తెలుపడంతో భూసేకరణ పూర్తిచేశారు. దసరాకు విస్తరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎన్ హెచ్-65ఫై ఇప్పటికే అధికారులు సర్వే పూర్తి చేశారు . రహదారి ఎక్కడ ఇరుకుగా ఉంది. ఎక్కడెక్కడ వంతెనలు అవసరం .. ఏయే ప్రాంతాల్లో కాలినడక వంతెనలు నిర్మించాలి అనేది గుర్తించారు. పటాన్ చెరు మండలం రుద్రారం ,హైదరాబాద్ లోని గంగారం వద్ద వంతెనలు, రామచంద్రాపురం ,బీహెచ్ఈఎల్ వద్ద కాలినడక వంతెనలు రానున్నట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు .
అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగేది ఇక్కడే . . .
జిల్లా పరిధిలో ఏటా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగేది ఎన్ హెచ్-65 పైనేనని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి . సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏటా 400 మంది రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం చెందుతుంటే ,కేవలం ఈ మార్గంలోనే 80 శాతానికి పైగా మృతువాత పడుతుండటం గమనార్హం . వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం ,పక్కనే దాబాలు,మద్యం దుకాణాలు,రోడ్డు పక్కన లారీలు నిలుపుతుండడం ప్రమాదాలకు కారణం అవుతుంది. ప్రమాదాల నివారణ చర్యలు కరువవడంతో ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఎక్స్ ప్రెస్ హైవే గా మారితే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు .