Patnam Narender Arrest: లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్‌ …తన ప్రమేయం లేదన్నమాజీ ఎమ్మెల్యే-exmla patnam narendra arrested in lagacharla incident ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Patnam Narender Arrest: లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్‌ …తన ప్రమేయం లేదన్నమాజీ ఎమ్మెల్యే

Patnam Narender Arrest: లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్‌ …తన ప్రమేయం లేదన్నమాజీ ఎమ్మెల్యే

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 13, 2024 08:40 AM IST

Patnam Narender Arrest: ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల ఘటనలో తన ప్రమేయం లేదని మాజీ ఎమ్మెల్యే చెబుతున్నారు.

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌

Patnam Narender Arrest: వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, రెవిన్యూ అధికారులపై జరిగిన దాడి వెనుక కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుడు సురేశ్‌ రాజ్‌ ఘటన జరిగిన సమయంలో ఆయనతో నిరంతరం సంప్రదించినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో కేబీఆర్‌ పార్క్ వద్ద మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి గ్రామస్తుల్ని రెచ్చగొట్టారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్‌ డేటా, సంభాషణలపై దర్యాప్తు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు సురేష్‌తో మాట్లాడినట్టు గుర్తించారు. కలెక్టర్‌పై దాడి యత్నం కేసులో భాగంగా అరెస్ట్ చేసి వికారాబాద్ తరలించారు.

తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం..

వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో సోమవారం కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ , ఇతర అధికారులపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.దాడి ఉదంతంపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ నుంచి ఈ వ్యవహారంపై సమీక్షించారు. సీఎం ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం రాత్రి ఘటనపై సమీక్ష నిర్వహించారు. మల్టీజోన్‌-2 ఐజీ సత్యనారాయణతో కేసు గురించి సమీక్షించారు. లగచర్లకు చెందిన సురేశ్‌రాజ్‌ దాడికి కుట్రపన్నినట్టు పోలీసులు ప్రకటించారు. షెడ్యూల్‌లో లేని గ్రామానికి రావాలని అతనే తీసుకువెళ్లినట్టు వెల్డించారు. సురేశ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని మంత్రికి వివరించారు. సురేశ్‌పై మూడు నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు ప్రధాన నిందితుడిగా చేర్చారు.

ప్రమేయం లేదంటున్న మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం కోసం వచ్చిన అధికారులపై జరిగిన దాడిలో తన ప్రమేయం ఏమీ లేదని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చెబుతు్నారు. దాడి జరగడానికి ముందు నిందితులు సంప్రదించారనే ఆరోపణల్ని తోసిపుచ్చారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు, బాధిత రైతులు గ్రామంలో ఉన్నారని, ప్రజల తరపున ఉండేందుకు వారితో ఫోన్‌లో మాట్లాడినట్టు చెప్పారు.

16మందికి రిమాండ్ విధించిన న్యాయస్థానం..

లగచర్ల గ్రామంలో సోమవారం కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి ఘటనలో 16 మందిని అరెస్ట్‌ చేసి మంగళవారం అర్ధరాత్రి కొడంగల్‌ కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించడంతో వారిని పరిగి సబ్‌జైలుకు తరలించారు. కలెక్టర్‌ దాడి జరగడంతో సోమవారం అర్ధరాత్రి దాటాక లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానితులైన 50 మందిని మంగళవారం పరిగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి సీసీ ఫుటేజీలు, వీడియోలు పరిశీలించి విచారించారు. దాడి ఘటనతో సంబంధం లేని 34 మందిని విడిచిపెట్టారు. మిగిలిన 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళవారం అర్ధరాత్రి కొడంగల్‌ ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ శ్రీరామ్‌ ఎదుట హాజరు పర్చారు.నిందితులకు రిమాండ్ విధించారు.

Whats_app_banner