ACB Raid in Hyderabad : రూ. 84 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారిణి - ఆపై కన్నీళ్లు..!
Telangana ACB Latest News: మరో ప్రభుత్వ అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. లంచం తీసుకుంటుండగా ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఏఈగా పని చేస్తున్న జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు.

ACB Trap in Hyderabad: ఇటీవలే కాలంలో లంచం డిమాండ్ చేస్తున్న కేసుల్లో పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అరెస్ట్ అవుతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో అవినీతి అధికారిణి ఏసీబీ వలకు చిక్కారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలోని ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తోన్న జగ జ్యోతి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారులకు దొరికిపోవటంతో… ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆఫీస్ లోనే కాకుండా…ఆమె నివాసం ఉంటున్న ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు.
ఇటీవలే నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో కూడా ఓ అధికారి ఏసీబీకి దొరికిపోయారు. రూ. 3 లక్షలను తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే…. డాక్టర్ లచ్చు నాయక్… ప్రస్తుతం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఔషధాల సరఫరా టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి రూ. 3 లక్షలను డిమాండ్ చేశాడు. డబ్బును ఇవ్వలేని వెంకన్న… అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారమే… వెంకన్న రూ. 3 లక్షలను లచ్చు నాయక్ కు ఇస్తుండగా… ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. లచ్చు నాయక్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకోవటంతో పాటు సదరు అధికారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.