Attack on Tribal Woman: గిరిజన మహిళపై ఎక్సైజ్ ఆఫీసర్ దాడి, బాధితురాలి ఫిర్యాదు
Attack on Tribal Woman: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఓ ఎక్సైజ్ అధికారి గిరిజన మహిళపై తీవ్రంగా దాడి చేశాడు. రోడ్డుపై వెళ్తున్న ఆమెను పిలిచి కర్రతో విపరీతంగా కొట్టాడు.
Attack on Tribal Woman: ఎక్సైజ్ అధికారి దాడిలో గాయపడిన గిరిజన మహిళ స్పృహ తప్పి పడిపోగా.. సదరు అధికారి అక్కడి నుంచి కారులో ఉడాయించాడు. నాలుగు రోజుల కిందట ఈ ఘటన జరగగా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం జాన్ పాకకు చెందిన తేవావత్ బుజ్జి అనే వివాహిత వ్యక్తిగత పని నిమిత్తం బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ టాటా సుమో వెహికిల్ ఆమె వద్దకు వచ్చి ఆగింది.
అందులో నుంచి నలుగురు వ్యక్తులు బయటకు వచ్చి, సార్ రమ్మంటున్నాడని చెప్పి కారు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అధికారిగా ఉన్న ఓ వ్యక్తి ఆమెకు ఖాళీ వాటర్ బాటిల్ ఆమె చేతికి ఇచ్చి పట్టుకోవాల్సిందిగా చెప్పారు. దీంతో కంగారు పడిపోయిన ఆమె బాటిల్ ఎందుకు పట్టుకోమంటున్నారని ఆయనను అడిగింది.
కోపోద్రిక్తుడైన సదరు అధికారి వెంటనే తిట్ల దండకం అందుకున్నాడు. నాకే ఎదురు చెబుతావా అంటూ బండి నుంచి కిందికి దిగాడు. అనంతరం అందులో ఉన్న కర్రను బయటకు తీసి, ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేయగా.. బూతులు తిడుతూ కర్రతో దాడి చేశారు.
ఆమెకు కాళ్లు, తొడల భాగంలో గాయాలై వాతలు తేలాయి. అనంతరం ఒక సెల్ ఫోన్ నెంబర్ ఆమెకు రాసిచ్చి, రూ.30 వేల నగదు తయారు చేసుకుని ఆ నెంబర్ కు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు. దీంతో సదరు మహిళ తీవ్ర భయాందోళనకు గురై కళ్లు తిరిగి పడిపోగా.. అక్కడున్న ఎక్సైజ్ అధికారులు అక్కడి నుంచి ఉడాయించారు.
ఆ తరువాత కొద్దిసేపటికి స్థానికులు ఆమెను లేపడంతో సదరు మహిళా తిరిగి ఇంటికి చేరుకుంది. అనంతరం తన భర్త కానియ కు జరిగిన విషయాన్ని చెప్పి బోరునవిలపించింది.
పట్టించుకోని అధికారులు
ఈ నెల 19న దాడి జరగగా.. తేజావత్ బుజ్జి జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ నెల 21న గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కంప్లైట్ తీసుకున్న పోలీసులు అధికారులు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. రోజులు గడుస్తున్నా పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
అన్యాయంగా తమను కొట్టిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. నిందితులకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి, తగిన యాక్షన్ తీసుకోవాలని బాధితురాలు బుజ్జి, డిమాండ్ చేశారు.
మండిపడుతున్న గిరిజన సంఘాలు
ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం పట్ల గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ ఆఫీస్ తో పాటు గీసుగొండ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టేందుకు కార్యచరణ రూపొందించినట్లు గోర్ సేన హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఫణి కుమార్ తెలిపారు.
ఈ మేరకు గిరిజనులు, విద్యార్థి సంఘాల నేతలతో ధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి, బాధితురాలికి న్యాయం చేసేంత వరకు పోరాడతామని ఫణికుమార్ తేల్చి చెప్పారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)