ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మృతదేహాల కోసం.. 35వ రోజు అన్వేషణ కొనసాగుతుంది. బురదలో కూరుకుపోయిన లోకో ట్రైన్ పరిసరాల్లో మరో సారి అనుమానిత ప్రాంతాన్ని కాడవర్ డాగ్స్ సూచించాయి. కాడవర్ డాగ్స్ సూచించిన ప్రదేశంలో సహాయక బృందాలు తవ్వకాలు మొదలుపెట్టాయి. తవ్వకాలలో ఉధృతంగా వస్తున్న నీటి ఊటతో ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
వస్తున్న నీటి ఊటను ఎప్పటికప్పుడు భారీ పంపులతో కృష్ణా నదిలోకి మల్లిస్తున్నారు. మూడు షిఫ్టులలో దాదాపు 600 మంది రెస్క్యూ బృందాలు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం నిర్మాణంలో ఫిబ్రవరి 22న పైకప్పు కూలి 8 మంది కార్మికులు గల్లంతైయ్యారు. ఆ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల మృతదేహాల కోసం దాదాపు నెల రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రమాదం జరిగిన నెల రోజులకు.. అంటే మార్చి 9న టన్నెల్ ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఇటీవల, సహాయక చర్యల్లో భాగంగా మరో మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. ఈ సహాయక చర్యల్లో దాదాపు 25 బృందాలుగా 600 మంది రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు. సొరంగంలో పేరుకుపోయిన బురదను తొలగించడానికి, నీటి ఊటను అడ్డుకోవడానికి రెస్క్యూ సిబ్బంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో పురోగతిని పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ప్రాజెక్టు అనేది నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటిని అందించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని నల్లగొండ జిల్లాకు తరలించడానికి 43.93 కిలోమీటర్ల పొడవైన ఒక సొరంగం (టన్నెల్) నిర్మిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం దీని లక్ష్యం. అలాగే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సంబంధిత కథనం