Exams Postponed : ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు అలెర్ట్.. ఆ పరీక్షలు వాయిదా-examination held on monday under osmania and kakatiya universities have been postponed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Exams Postponed : ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు అలెర్ట్.. ఆ పరీక్షలు వాయిదా

Exams Postponed : ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు అలెర్ట్.. ఆ పరీక్షలు వాయిదా

Basani Shiva Kumar HT Telugu
Sep 02, 2024 07:43 AM IST

Exams Postponed : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కనీసం బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశాయి.

పరీక్షలు వాయిదా
పరీక్షలు వాయిదా

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సోమవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 3వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. వాయిదా పడిన పరీక్షలపై త్వరలో ప్రకటన చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వివరించారు.

కేయూ పరిధిలోనూ..

భారీ వర్షాల నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీ వాకాటి కరుణ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేయూ పరిధిలోని అన్ని కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. కేయూ పరిధిలో సోమవారం జరగాల్సిన థియరీ, ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్.. అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి ప్రకటించారు. మంగళవారం నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. వాయిదా వేసిన పరీక్షలు మళ్లీ నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని ప్రొఫెసర్ మల్లారెడ్డి వివరించారు.

అన్ని విద్యా సంస్థలకు సెలవు..

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న కుంభవృష్టి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది. అత్యవసర పని ఉంటేనే బయటకు రావాలని స్పష్టం చేసింది. రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఏ సమస్య వచ్చినా డయల్ 100 కు ఫోన్ చేయాలని తెలంగాణ పోలీసులు సూచించారు. వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో.. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు.

సోమవారం కూడా..

తెలంగాణలోని పలు సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ సహా.. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మంగళవారం నాడూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని స్పష్టం చేస్తున్నారు.

8 జిల్లాలకు రెడ్ అలెర్ట్..

సోమవారం..ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ రోజు ఉదయం 8.30 గంటల వరకు.. ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.